-‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
-దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్సీ సోము వీర్రాజు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్ ఎల్ సి సోము వీర్రాజు లు విభిన్న ప్రతిభావంతులతో కలిసి బస్సులో ప్రయాణించి, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులకు ఆర్టీసీ బస్సుల్లో గుర్తించిన కేటగిరీలలో 50 శాతం టికెట్ రాయితీ కల్పించినట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు అవసరమైన శారీరక, వైద్య, ఆర్థిక తదితర రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన దివ్యాంగులకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉపాధి రుణాలు, సబ్సిడీపై త్రిచక్ర వాహనాలు తదితర సహాయాలను అందిస్తూ సమాజంలో వారిపై ఉన్న అవరోధాలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా వారి జీవితాల్లో భరోసా నింపుతోందని తెలిపారు. దివ్యాంగులను దయతో చూసే విధానం మారాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులలో అపారమైన శక్తి సామర్థ్యాలు, అంతులేని ఆత్మస్థైర్యం ఉంటాయని పేర్కొన్నారు. తగిన అవకాశాలు కల్పిస్తే వారు అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు. అనంతరం తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే నివాసంలో దివ్యాంగులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (ఆర్ఎంసి) ఎస్. వెంకటరమణ, సెక్రటరీ (ఆర్ఎంసి) శైలజవల్లి, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ (రాజమహేంద్రవరం) కె. మాధవ్, పీఆర్వో బి.ఎస్. కుమార్, ఎస్.ఎం. ఏ.వి. రావు, కూటమి నాయకులు కుడుపూడి సత్తిబాబు, మజ్జి రాంబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, వర్రే శ్రీనివాసరావు, పక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News