-రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్
-దేశ ప్రగతికి ‘జనగణన’ దిక్సూచి అని, జనగణనలో నేను నమోదు చేసుకున్నాను.. మీరు కూడా పాల్గొనండి!” మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
-ప్రజాస్వామ్య పరిపాలనలో జనాభా లెక్కలే కీలకం..జనాభా ప్రాతిపదికనే సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుంది..జనగణనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని వెల్లడి
-ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని అధికారులకు సహకరించాలని మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి
-‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రారంభం అయింది…. అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపు
-ఏప్రిల్ 30 వరకు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’కు అవకాశం.. మే 1 నుండి ఇంటింటికి ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని పేర్కొన్న మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన-2027 ప్రక్రియలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. గురువారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమక్షంలో తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాల నమోదు పూర్తయిన అనంతరం వాటిని క్షుణ్ణంగా సరిచూసుకుని, ప్రక్రియ విజయవంతంగా ముగియడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేది అత్యంత ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించడమే ప్రజా ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. దేశంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల సంఖ్య కచ్చితంగా తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను రూపొందించడానికి వీలవుతుందని ఆయన వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ అవకాశం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
“నేను జనగణనలో పాల్గొని నా వివరాలను నమోదు చేసుకున్నాను.. మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించడం ద్వారా దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని, తద్వారా రాబోయే తరాలకు మెరుగైన ప్రణాళికలు అందేలా చూడాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News