Breaking News

బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

-ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాణాసంచా తయారీ మరియు విక్రయ దుకాణాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలను మూసివేసిన విషయం తెలిసిందే అన్నారు.

ఈ నేపథ్యంలో దుకాణాల పునఃప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని బాణాసంచా తయారీ దారుల అసోసియేషన్లు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో, బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్, ఎస్పీ , జేసి లు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అధికారుల బృందాలు తమ నివేదికలను సమర్పించాయన్నారు. అనుమతుల కంటే అధిక మొత్తంలో పేలుడు పదార్థాలను ఒకే చోట నిల్వ ఉంచడం, పండుగలు మరియు జాతరల సమయంలో అధిక ఆర్డర్ల కారణంగా నైపుణ్యం లేని కార్మికులను వినియోగించడం, సరైన వెలుతురు మరియు భద్రతా ఏర్పాట్లు లేని గదుల్లో తయారీ నిర్వహించడం, అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడం వంటి అంశాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని అధికారులు వివరించారు.

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. ఎంత మేరకు స్టాక్ నిర్వహణ విషయంలో అనుమతులు పొందారో అంత మేరకు మాత్రమే బాణాసంచా తయారీ చేపట్టాలని స్పష్టం చేశారు. తయారీ ప్రక్రియలో అనుభవం మరియు నైపుణ్యం కలిగిన కార్మికులను మాత్రమే నియమించాలన్నారు. ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు తప్పనిసరిగా బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించారు.

అదేవిధంగా తయారీ కేంద్రాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, తగిన విద్యుత్ భద్రతా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. పేలుడు పదార్థాల నిల్వ, రవాణా, వినియోగంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

బాణాసంచా దుకాణాలు మూసివేయడంతో కొంతమంది జీవనోపాధి కోల్పోతున్న విషయం వాస్తవమేనని, అయితే మానవ ప్రాణాలు అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అధిక డిమాండ్ ఉన్న సమయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించకుండా వ్యాపారం కొనసాగించే విధంగా అసోసియేషన్లు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని సూచించారు.

లైన్ డిపార్ట్మెంట్ అధికారులు మరియు అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆమోదం పొందే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.

జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాల్లో భద్రతా నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదన్నారు. అనుమతులు లేని ప్రదేశాల్లో పేలుడు పదార్థాల నిల్వ, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా తయారీ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖలు సమన్వయంతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, బాణాసంచా తయారీ మరియు విక్రయ కేంద్రాలు ప్రభుత్వ నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తయారీ యూనిట్లలో కార్మికుల భద్రత, పేలుడు పదార్థాల నిల్వ, రవాణా అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి యూనిట్‌కు సంబంధించిన అనుమతులు, లైసెన్సులు, భద్రతా ధ్రువపత్రాలు ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తూ భద్రతా ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. SOP రూపకల్పనలో అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డీ. నరసింహ కిషోర్ , జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కొవ్వూరు రాజమహేంద్రవరం ఆర్టీవో లు కె .ఆనంద రావు , ఆర్ శివ రాముడు, జిల్లా అగ్ని మాపక అధికారి కె. మార్టిన్ లూథర్ కింగ్, డీఎస్పీ దేవకుమార్, శ్రీకాంత్ , రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకవిభాగాల అధికారులు, బాణాసంచా తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *