-కూటమి రెండో ఏడాది పాలనలో మరింతగా మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు
-ఆరోగ్యాంధ్రప్రదేశ్, నూతన జనాభా నిర్వహణకు అనుగుణంగా ప్రారంభంకానున్న చర్యలు
-గత రెండేళ్ల పాలనలో ప్రయత్నాలు, ఫలితాలపై ముఖ్యమంత్రికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సమగ్ర నివేదిక
-సాయం అందించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరచడానికి వైద్యారోగ్య శాఖ చేసిస ప్రయత్నాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారంనాడు సమగ్రమైన నివేదికను అందజేశారు. నాలుగు పేజీల సమీక్షతో కూడిన లేఖతో పాటు విభాగాలవారీగా సాధించిన ఫలితాలపై 8 పేజీల నివేదికను మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి పంపారు.
వైద్యులు, ఆసుపత్రుల స్థాయిలో పనితీరు మదింపు
గత ప్రభుత్వం నుంచి ఆరోగ్య రంగంలో వారసత్వంగా సంక్రమించిన సమస్యల్ని పరిష్కరించి, ప్రజారోగ్య వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టడం ద్వారా మొదటి ఏడాది కంటే రెండో ఏడాదిలో మరింత సానుకూల ఫలితాలు లభించాయని మంత్రి తన లేఖలో ముఖ్యమంత్రికి వివరించారు. మొదటి ఏడాదిలో వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు 7 శాతం పెరగ్గా రెండో ఏడాది పాలనలో హాజరు 28.13 శాతం పెరిగిందని, తదనుగుణంగా వైద్య సేవల్లో భారీ పురోగతిని సాధించామని మంత్రి తెలిపారు. విస్తృతమైన ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించి మొత్తమ్మీద సానుకూల ఫలితాలు లభించినా, ఆసుపత్రులవారీగా, ప్రాంతాలవారీగా పనితీరులో వ్యత్యాసాలు కనిపించాయని, వీటిని అధిగమించి వ్యవస్థ పూర్తి సామర్ధ్యాన్ని ప్రజలకు అందజేసే దిశగా చర్యల్ని చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించామని మంత్రి వివరించారు.
12,756 ప్రభుత్వాసుపత్రులు, 13,000 వైద్యులు
10,032 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 244 సెకండరీ ఆసుపత్రులు, 38 బోధన మరియు స్పెషాలిటీ ఆసుపత్రులతో కలిపి మొత్తం 12,756 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 13,000 కు పైగా వైద్యులు పనిచేస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నివేదికలో వెల్లడించారు. ప్రతి వైద్యుడు, ఆసుపత్రి స్థాయిలో పనితీరును నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు మరింత అధిక స్థాయిలో నాణ్యమైన వైద్య సేవల్ని అందిస్తామని, ఈ దిశగా లక్ష్యాలను రూపొందిస్తామని మంత్రి వివరించారు.
ఒక రోజులో ఒక వైద్యుడు అందించాల్సిన ఓపీ, ఐపీ, శస్త్ర చికిత్సల సేవల సంఖ్యను ప్రమాణీకరించి, వీటి ఆధారంగా వైద్యుల లభ్యతను బట్టి ఆయా ఆసుపత్రులు అందించాల్సిన సేవల సంఖ్యలను నిర్ధారించి, తదనుగుణంగా లక్ష్యాల్ని నిర్దేశిస్తామని మంత్రి వివరించారు. ఈ ప్రమాణాల మేరకు నిరంతర పర్యవేక్షణతో మూడు నెలలకోసారి ప్రతి వైద్యుడు మరియు ప్రతి ఆసుపత్రి అందించిన సేవల్ని అంచనా వేసి, లక్ష్యాల మేరకు పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. దీని ద్వారా ప్రజారోగ్య వ్వవస్థ పూర్తి సామర్ధ్యాన్ని ఆచరణలో అందుకోవడానికి అవకాశముంటుందని అన్నారు.
ఈ రీతిన ప్రతి వైద్యుడు, నర్స్, టెక్నీషియన్ మరియు ఆసుపత్రుల జవాబుదారీతనాన్ని పెంచడానికి పటిష్టమైన చర్యల్ని చేపడతామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి వివరించారు.
ఆయుష్ సేవలకు ఊతం
కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆయుష్ సేవల విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని , దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.124 కోట్ల కేంద్ర సాయాన్ని పొందగలిగిందని మంత్రి తెలిపారు. కేంద్ర సాయంతో కొత్త 6 ఏకీకృత(ఇంటిగ్రేటెడ్) ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు, 3 కొత్త కాలేజీల స్థాపనకు అనుమతులు సాధించామని మంత్రి వివరించారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో భారీ వృద్ధి
నిరాశానిస్పృహల్లో ఉన్న ప్రతిపక్షం అసత్య ప్రచారాలకు భిన్నంగా గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం భారీ వృద్ధి సాధించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి సోదాహరణంగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పధకం కింద సగటున 8.20 లక్షల మంది మాత్రమే లబ్ది పొందగా ఈ సంఖ్య 74 శాతం పెరిగి ఏడాదికి 14.27 లక్షల మంది లబ్ది పొందారని మంత్రి వివరించారు. సగటు సాలీనా ఖర్చు రూ. 2,415 కోట్ల నుంచి రూ. 57 శాతం పెరిగి కూటమి పాలనలో రూ. 3,805 కోట్లకు పెరిగిందని, ఏడాదికి గత ప్రభుత్వం రూ.1,987 కోట్లు మాత్రమే నెట్వర్క్ ఆసుపత్రులకు విడుదల చేయగా, ఇది కూటమి హయాంలో 66 శాతం పెరిగి రూ.3,300 కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు.
ఆరోగ్యాంధ్ర దిశగా…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో రూపొందిన ఆరోగ్యాంధ్రపదేశ్ విజన్‌కు అనుగుణంగా , దీనికి అనుబంధమైన నూతన జనాభా నిర్వహణ లక్ష్యాల్ని సాధించే దిశగా అవసరమైన వ్యవస్థాగత ఏర్పాట్లపై రానున్న మూడేళ్లలో వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి వివరించారు. లక్ష్య సాధనకు దోహదం చేసే వివిధ అంశాలకు సంబంధించి సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ల ఏర్పాటుకు కార్యక్రమాల రూపకల్పన చేపడతామని మంత్రి తెలిపారు.
అరుదైన వ్యాధులు(రేర్ డిసీజెస్) పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణకు అవసరమైన విషయ విజ్ఞాన సేకరణ, పరిశోధనలు, పరిష్కార మార్గాలు, సంబంధిత వైద్య సేవలు అందించడానికి అవసరమైన వ్యవస్థాగత ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
వివిధ ఆరోగ్య కార్యక్రమాల్ని సంజీవిని పధకంతో అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో డిజిటల్ వైద్య సేవల్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేసి వైద్య సేవల్ని పొందడంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నివేదికలో ముఖ్యమంత్రికి వివరించారు.
గత రెండేళ్లుగా ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హితోధికంగా రాష్ట్రానికి సాయాన్ని అందించడం వల్ల మంచి ఫలితాల్ని సాధించగలిగామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తన లేఖలో వ్యాఖ్యానించారు.
Prajavartha Online Telugu News