-ముఖ్య అతిథులుగా డా. బొమ్మరాజు సారంగిపాణి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
-“నా తండ్రి పీ.వి. చలపతిరావే నాకు స్ఫూర్తి” – ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీయన్ మాధవ్
-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన “వీర సావర్కర్” చారిత్రక నాటకం
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, దివంగత పీ.వి. చలపతిరావు 92వ జయంతి సందర్భంగా నిర్వహించిన నాలుగో స్మారక ఉపన్యాస కార్యక్రమం విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పీ.వి. చలపతిరావు తనయులు పీవీయన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డా. బొమ్మరాజు సారంగిపాణి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, దివంగత పీ.వి. చలపతిరావు విద్యా, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. సమాజాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీయన్ మాధవ్ మాట్లాడుతూ, “నా తండ్రి పీ.వి. చలపతిరావే నాకు స్ఫూర్తి. ఆయన పుట్టినరోజు జూన్ 26 కాగా, దానికి ముందు రోజు అయిన జూన్ 25, 1975 అర్ధరాత్రి దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. ఆ సమయంలో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు అరెస్టుకు దొరకకుండా 19 నెలల పాటు మారు వేషంలో తిరుగుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి ఊపిరి పోశారు” అని తెలిపారు.
అలాగే, “పీ.వి. చలపతిరావుకు వీర సావర్కర్‌తో ఉన్న సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నించవచ్చు. వీర సావర్కర్ జాతీయవాద స్ఫూర్తిని, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని చలపతిరావు ప్రజా జీవితాన్ని కొనసాగించారు” అని పేర్కొన్నారు.
మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, వీర సావర్కర్ వంటి విప్లవయోధుల స్ఫూర్తితోనే పీ.వి. చలపతిరావు ప్రజా జీవితంలో సేవలందించారని కొనియాడారు. వారు చూపిన జాతీయవాద మార్గంలోనే తామంతా నడుస్తున్నామని అన్నారు.
ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, వీర సావర్కర్ ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని వివరించారు. సావర్కర్ సుమారు 32 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడుపుతూ 12 పుస్తకాలను రచించారని తెలిపారు. అండమాన్ జైలులో గోడలపై వేలాది పద్యాలను రచించి, వాటిని అనంతరం పుస్తక రూపంలో తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. సావర్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు అనేక మంది యువతను జాతీయోద్యమాల్లో పాల్గొనేలా ప్రేరేపించాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ స్వాతంత్ర్య భావజాలాన్ని వ్యాప్తి చేసి, హిందూ సమాజ ఐక్యత కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు.
డా. బొమ్మరాజు సారంగిపాణి మాట్లాడుతూ, దివంగత పీ.వి. చలపతిరావు చేసిన సేవలను కొనియాడారు. ఎమర్జెన్సీ కాలంలో తాము ఆయనతో కలిసి సుమారు 19 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నామని గుర్తుచేశారు. ఆ సమయంలో చలపతిరావు మారువేషాల్లో సంచరిస్తూ ఉద్యమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారని తెలిపారు. అలాగే, అండమాన్ సెల్యులార్ జైలులో వీర సావర్కర్ అనుభవించిన కష్టాలు, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ మాస్టారు, సంస్కార భారతి రాష్ట్ర అధ్యక్షులు పీవీయన్ కృష్ణ, పరశురాం రాజు, ద్వారంపూడి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన “వీర సావర్కర్” చారిత్రక నాటకం
కార్యక్రమంలో భాగంగా సంస్కార భారతి సమర్పణలో డా. పీవీయన్ కృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించిన “వీర సావర్కర్” చారిత్రక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పాత్రధారుల నటన, సంభాషణలు, వాచకం విశేష ప్రశంసలు అందుకున్నాయి. ఆహార్యం, రంగాలంకరణ, నేపథ్య సంగీతం నాటకానికి మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి. నాటకం ముగిసిన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News