పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందించడంలో యోగా, ప్రాణాయామం అత్యంత ప్రభావవంతమైన సాధనాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
పామర్రు మండలంలోని పామర్రు మహిళా ప్రగతి కోచింగ్ సెంటర్లో సమగ్ర శిక్ష విద్యా శాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న యోగా శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. జూన్ 30 నుంచి జూలై 6 వరకు ఏడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు.
శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం పిల్లలు చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత సాధించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. సరైన నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, అనవసర ఆలోచనలు వంటి కారణాల వల్ల మనస్సు ఒక విషయంపై కేంద్రీకరించలేకపోతుందని చెప్పారు. ఏ పని చేస్తున్నామో దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని వివరించారు.
విద్యార్థులు ఇంట్లో గంటల తరబడి చదవడం కంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ట్యూషన్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పూర్తి ఏకాగ్రతతో వినడం వల్ల మంచి మార్కులు సాధించానని తన అనుభవాన్ని ఉపాధ్యాయులతో పంచుకున్నారు. విద్యార్థులు తరగతి గదిలో శ్రద్ధగా వినే అలవాటు పెంపొందితే వారి విద్యా ఫలితాలు సహజంగానే మెరుగుపడతాయని అన్నారు.
ప్రతి పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు యోగా, ప్రాణాయామం చేయించి అనంతరం విద్యార్థులను తరగతులకు పంపిస్తే వారి ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి ఏకాగ్రత ఒకే విధంగా ఉండదని, అయితే యోగా, ప్రాణాయామం ద్వారా ప్రతి ఒక్కరిలోనూ మానసిక స్థిరత్వం, దృష్టి కేంద్రీకరణ మెరుగుపడుతుందని చెప్పారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి యోగా సాధనను పాఠశాలల్లో నిత్య కార్యక్రమంగా అమలు చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు.
జూన్ 30 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న ఈ ఏడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని యోగాలో నేర్చుకున్న అంశాలను ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అందించాలని కలెక్టర్ వ్యాయామ ఉపాధ్యాయులను కోరారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా అధికారి యు వి సుబ్బారావు, డిప్యూటీ డీఈవో పద్మరాణి, ఎంఈఓ భానుప్రకాష్, యోగా శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News