Breaking News

గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం అభినందనీయం: ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు

-పామర్రు మండలం, కనుమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేసిన గవర్నర్
-కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్

కనుమూరు (పామర్రు), నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాభివృద్ధి, విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవలను సమన్వయం చేస్తూ కనుమూరు గ్రామంలో చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు.

బుధవారం ఆయన పామర్రు మండలం కనుమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గ్రామ ప్రవేశ ముఖద్వారాన్ని ప్రారంభించడం, స్వర్గపురి (శ్మశానవాటిక) అభివృద్ధి పనులకు భూమిపూజ చేయడం, పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు.

కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా, బోడె ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ గ్రామ ప్రవేశ ముఖద్వారాన్ని ప్రారంభించడం, స్వర్గపురి (శ్మశానవాటిక) అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలని గవర్నర్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు ఇతర గ్రామాలకు సైతం ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

నేడు గ్రామాల్లో విద్య, రహదారులు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్న గవర్నర్, గ్రామాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామం పట్ల అనుబంధాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలు, గ్రామ పెద్దలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పదో తరగతి పరీక్షల్లో 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై, వారందరికీ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రోత్సాహకం ఆర్థిక సహాయం కంటే విద్యార్థుల్లో మరింత ఉన్నత లక్ష్యాలు ఏర్పడేలా ప్రేరణ కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించడం శుభపరిణామమని పేర్కొన్న గవర్నర్, ప్రపంచం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. తమ అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా బయాలజీ, ఆర్ట్స్, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్ వంటి రంగాలను ఎంపిక చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా రాణించాలని సూచించారు.

గ్రామం నుంచి ఉన్నత స్థానాలకు చేరుకున్న అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, విద్యావేత్తలు, విదేశాల్లో రాణిస్తున్న యువతను ఆదర్శంగా తీసుకుని తాము కూడా అలాంటి విజయాలను సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కోల్ ఇండియా సంస్థ సహకారంతో సుమారు రూ.1.53 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో శ్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టడం, అలాగే రూ.10 లక్షల వ్యయంతో గ్రామ ప్రవేశ ముఖద్వారం (ఆర్చ్) నిర్మించడం అభినందనీయమన్నారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం కృషి చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. గ్రామాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు.

డాక్టర్ కంభంపాటి హరిబాబు ప్రజా జీవితంలో కష్టపడి వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ, పార్లమెంట్ సభ్యుడిగా, మిజోరం గవర్నర్‌గా, ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

చిన్న లక్ష్యాలు కాదు.. గొప్ప లక్ష్యాలతో ముందుకు సాగాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

విద్యార్థులు చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా ఉన్నత ఆశయాలు నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి విద్యార్థులకు ఉద్బోధించారు.

ప్రస్తుతం విద్యార్థుల ముందున్న అవకాశాలు అపారమని, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని ఉన్నత విద్యతో పాటు జీవితంలో గొప్ప విజయాలను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

విద్యార్థులు కేవలం డాక్టర్, ఇంజినీర్, ఉపాధ్యాయుడు వంటి ఉద్యోగాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా, భవిష్యత్తులో పెద్ద సంస్థలను స్థాపించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మారడమే కాకుండా సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించే స్థాయికి, వైద్యుడిగా ఎదగడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శ్రేణిని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించాలన్నారు.

అదేవిధంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్న దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్మశాన వాటిక అభివృద్ధికి దాదాపు రూ.1.53 కోట్ల నిధులు కోల్ ఇండియా నుండి జిల్లాకు రావడం ఎంతో శుభపరిణామం అని అభినందించారు.

పామర్రు ప్రగతి పథంలో దూసుకెళ్తోంది: ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, గ్రామాల సమగ్ర అభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, దాతలు కలిసి కృషి చేస్తున్నారని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు.

కనుమూరులో రూ.1.53 కోట్ల వ్యయంతో స్వర్గపురి శ్మశానవాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభించడంతో పాటు, మరో రూ.50 లక్షలతో నిర్మించిన పడమూరు గ్రామ రహదారిని ప్రజలకు అంకితం చేశామని తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆ రహదారికి ఇప్పుడు రూపుదిద్దడం ఆనందంగా ఉందన్నారు.

పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే, 21 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇదే పాఠశాల నుంచి చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని తమ గ్రామానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డిఓ ఎస్ కరుణ కుమారి, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, ఎండోమెంట్ సహాయ కమిషనర్ లలిత, దాత ఎలమంచిలి వాసుదేవరావు, విద్యార్థులు, గ్రామస్తులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *