విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో “DRUGS VADDU BRO” కార్యక్రమంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ జూలై 1 నుంచి 3 వరకు గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో పాఠశాల విద్యా శాఖ కమీషనర్ తమీమ్ అన్సారియా ఐఏఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు హ్యాండ్‌బుక్, కరిక్యులమ్ కంటెంట్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా ఐఈసీ (IEC) మెటీరియల్, మాదకద్రవ్యాల నిరోధక అంశాలను చేర్చడం, పర్యవేక్షణ, మూల్యాంకన వ్యవస్థను అభివృద్ధి చేయడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోసం ప్రత్యేక హ్యాండ్‌బుక్‌లను సిద్ధం చేయడం ఈ కార్యక్రమంలోని ముఖ్య లక్ష్యాలని వివరించారు. ఇవన్నీ కలిసి రానున్న మూడు సంవత్సరాల్లో “DRUGS VADDU BRO” కార్యక్రమ అమలుకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలవాలి
డ్రగ్స్ నివారణ పై ఇతర రాష్ట్రాల్లోని నమూనాలను యథాతథంగా అనుసరించడం కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కంటెంట్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కమీషనర్ తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచే నమూనాగా ఉండాలన్నారు. 6-12 తరగతుల వరకు అమలు చేయాలని ప్రతిపాదిస్తున్న ఈ హ్యాండ్ బుక్, వయస్సుకు తగిన విధంగా, ఆసక్తికరంగా ఉండి, విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని స్వీకరించేలా ఉండాలన్నారు. ప్రవర్తనా మార్పును తీసుకురావడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తమీమ్ అన్నారు. ఈ కార్యక్రమం తరగతి గది బోధనలో సహజంగా భాగమయ్యేలా రూపొందించాలని, అదనపు బాధ్యతగా ఉపాధ్యాయులకు అనిపించకుండా ఉండేలా కంటెంట్‌ను రూపొందించాలని నిపుణులకు చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమస్య అని పేర్కొన్న తమీమ్, ఈ వర్క్‌షాప్‌ను ఒక సాధారణ సమావేశంగా కాకుండా, రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును రక్షించే అవకాశంగా భావించాలని అన్నారు.
మార్పు టీచర్ల నుండే మొదలవుతుంది
ఈ సందర్భంగా ఈగిల్ ఆంధ్రప్రదేశ్ (EAGLE AP) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి. స్వరూపా రాణి, ఐపీఎస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసు, పాఠశాల విద్య, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేల ఈగిల్ క్లబ్‌లు పాఠశాలల్లో పనిచేస్తూ, విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తూ మాదకద్రవ్య రహిత పాఠశాలల నిర్మాణానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. డ్రోన్ సర్వైలెన్స్, ఈగిల్ ఆపరేషన్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నప్పటికీ, శాశ్వతమైన మార్పు ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచే ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు.
ToFEI, EAGLE Clubs కార్యక్రమాలపై విద్యార్థుల్లో అవగాహన పెరగాలి
ToFEI రాష్ట్రం అధికారి డాక్టర్ గీతా పద్మజ మాట్లాడుతూ, పిల్లల్లో సానుకూల విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యాశాఖ, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్న ToFEI, EAGLE Clubs వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్లానింగ్ డైరెక్టర్ డి. మధుసూదన్ రావు, ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ వి. విజయదుర్గ, (నోడల్ ఆఫీసర్), సురేష్ కుమార్ (సీమ్యాట్), పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఎస్సీఈఆర్టీ, సమగ్ర శిక్ష, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖతో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News