విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో “DRUGS VADDU BRO” కార్యక్రమంపై మూడు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ లో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, వివిధ రంగాల నిపుణులను ఉద్దేశించి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ మాట్లాడారు.
విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించేందుకు హ్యాండ్‌బుక్ ను పాఠ్యాంశ పుస్తకం లా కాకుండా వినూత్నంగా, అవగాహన పెంచేలా రూపొందించాలని, విద్యార్థుల వయస్సుకు అనుగుణంగా ఐఈసీ (IEC) మెటీరియల్ ను తయారు చేయాలన్నారు.
నేటి పిల్లలు గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన సామాజిక, విద్యా, డిజిటల్ వాతావరణంలో పెరుగుతున్నారని ఆయన అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయంలో మార్గనిర్దేశం చేయడం అవసరమని సూచించారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవన నైపుణ్యాలు, భావోద్వేగ నియంత్రణ, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడం కూడా విద్యలో భాగంగా ఉండాలని సూచించారు. కొత్త కార్యక్రమాలు ఉపాధ్యాయులపై అదనపు భారం కాకుండా, వారి పనిని మరింత సులభతరం చేసే విధంగా హ్యాండ్ బుక్ రూపకల్పన చేయాలని ఆయన సూచించారు.
డిజిటల్ మీడియా ద్వారా అవగాహన కల్పించండి
పాఠశాలల్లో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు ఆధునిక సమాచార మాధ్యమాలను కూడా సమర్థంగా వినియోగించాలని ఎస్పీడీ సూచించారు. పాఠశాలల్లో మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమాలను తరగతి గది కార్యకలాపాలు, అవగాహన కార్యక్రమాలు, స్కిట్లు, తల్లిదండ్రుల సమావేశాలు వంటి వివిధ రూపాల్లో కొనసాగించాలని అన్నారు. మాదకద్రవ్యాల ముప్పు నుంచి నేటి, రేపటి తరాలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీడీ బి. శ్రీనివాసరావు ఐఏఎస్ అన్నారు. పాఠశాలల్లో డ్రగ్స్ నివారణ కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, నిపుణులు, సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్లానింగ్ డైరెక్టర్ డి.మధుసూదన రావు , ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ వి. విజయదుర్గ, ( నోడల్ ఆఫీసర్), బి. సురేష్ కుమార్ ( సీమ్యాట్), పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఎస్‌సీఈఆర్‌టీ, సమగ్ర శిక్ష, ఆరోగ్య శాఖ, ఈగల్ క్లబ్స్, పోలీసు శాఖతో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News