గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనాల్టీ డిజిటల్ అడ్వాన్స్డ్ యాప్ తో నగర పరిశుభ్రతకు భంగం కల్గించే వారిపై అపరాధ రుసుం విధింపు
నగర పరిశుభ్రతను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ‘స్వచ్ఛ గుంటూరు’ పేరుతో డిజిటల్ యాప్, వెబ్ డ్యాష్‌బోర్డ్‌ను గుంటూరు నగరపాలక సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి యాప్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకమైన, వేగవంతమైన పారిశుధ్య ఉల్లంఘనల పర్యవేక్షణకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు, వ్యాపార సంస్థలపై డిజిటల్ చలానాలు జారీ చేసే సౌకర్యం ద్వారా వ్యక్తిగత, దుకాణాల వారీగా చలానా విధింపుకు ప్రత్యేక విధానం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి అపరాధ రుసుం విధింపుకు ఫోటో, జియో-లొకేషన్‌తో నమోదు చేసే సౌకర్యం ఉందన్నారు. చలానాలను ఆన్‌లైన్ లో తక్షణం, తదుపరి చెల్లింపు సదుపాయంతో పాటు చెల్లించే వరకు వారి ఫోన్ కి అలర్ట్ మెసేజ్ లు వస్తాయని పేర్కొన్నారు. ఆయా చలనాల చెల్లింపులు, లేదా వివరాలను అధికారులు రియల్-టైమ్ వెబ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. అలాగే వాట్సాప్ నోటిఫికేషన్ వ్యవస్థ ద్వారా చలానాల సమాచారాన్ని సంబంధిత వారికి చేరవేయచ్చని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలు సహకరించాలని, స్వచ్ఛ గుంటూరు లక్ష్య సాధనలో సాంకేతికతను వినియోగిస్తూ పరిశుభ్రత, బాధ్యతాయుత పౌరసేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News