అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొమ్మినేనివారిపాలెంలో బుధవారం నాడు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 65 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ.33 వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం మరొకటి లేదని పేర్కొన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. మరోవైపు స్పౌజ్ పింఛన్ల మంజూరును కూడా ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోందని చెప్పారు. పర్యటనలో భాగంగా గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగు పరిచే లక్ష్యంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఎలక్ట్రిక్ స్టవ్‌లను అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందించే ప్రతి పథకం పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
Prajavartha Online Telugu News