అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలు, లో ఓల్టేజ్ సమస్యల నివారణ దిశగా అధికారులు పని చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం నాడు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, బీఈఎస్ఎస్ ప్రాజెక్టులు, భవిష్యత్తు విద్యుత్ అవసరాలపై సమీక్షించారు. ట్రాన్స్ కో పరిధిలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి తావులేకుండా కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, గడువు లోపు ప్రాజెక్టులను పూర్తి చేయించే బాధ్యత అధికారులు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని అధికారులు సమావేశంలో మంత్రి గొట్టిపాటికి వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 80 శాతానికి పైగా నమోదైందని తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇది 45 నుంచి 50 శాతం మధ్యే ఉండేదని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి గుర్తుచేశారు. థర్మల్ కేంద్రాల్లో కనీసం 15 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నాణ్యమైన బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏపీ జెన్‌కోను మరింత బలోపేతం చేసి, రాష్ట్ర అవసరాలకు స్వీయ విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా విద్యుత్ కొనుగోళ్లను తగ్గించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్‌ఎస్) నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. విద్యుత్ రంగ సేవలపై ప్రజల్లో మరింత సంతృప్తి పెరిగేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఈ సమీక్షకు సమీక్షకు జెన్కో, ట్రాన్స్ కో జేఎండీలు పుల్లారెడ్డి, ప్రవీణ్ చంద్, డైరెక్టర్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News