విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ నగరవ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం నగరంలోని అన్ని సర్కిళ్లు, డివిజన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ నుంచి నీటి నమూనాలను సేకరించి రెసిడ్యువల్ క్లోరిన్ (ఆర్సీ) పరీక్షలను నిర్వహించారు. తాగునీటిలో నిర్దేశిత స్థాయిలో క్లోరిన్ ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. తాగునీటి సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా క్లోరిన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అదనపు క్లోరినేషన్ నిర్వహించి తాగునీటి నాణ్యతను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
తాగునీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు నగరవ్యాప్తంగా ఆర్సీ పరీక్షలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, అవసరమైన చోట్ల నీటి నమూనాలను ప్రయోగశాలలకు పంపించి నాణ్యత పరీక్షలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసుకోవాలని, నీటి వృథాను నివారించాలని, కమిషనర్ ధ్యానచంద్ర విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News