-లా, న్యాయ మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం “స్వర్ణాంధ్రప్రదేశ్–2047” లక్ష్య సాధన దిశగా సంక్షేమం, సామాజిక న్యాయం, మైనారిటీల సాధికారత, పారదర్శక న్యాయపాలనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర న్యాయ, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ తెలిపారు.
గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, హజ్ సేవలు, డిజిటల్ పరిపాలన, న్యాయ సంస్కరణలు, కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమం, ఈ-కోర్టుల విస్తరణ వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
2026-27లో కూడా మైనారిటీల సాధికారత, సమాన న్యాయం, నాణ్యమైన న్యాయపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి పౌరుడికి న్యాయం, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ‘స్వర్ణాంధ్రప్రదేశ్–2047’ విజన్ సాధనలో ఇదే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
మైనారిటీల సంక్షేమానికి రూ.16,147.23 కోట్ల భారీ బడ్జెట్
2024-25 నుండి 2026-27 వరకు మైనారిటీల సంక్షేమ శాఖకు రూ.16,147.23 కోట్ల బడ్జెట్ కేటాయించగా, గత రెండేళ్లలో రూ.9,759.70 కోట్లు వ్యయం చేయబడిందని మంత్రి తెలిపారు. ఇందులో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ.4,850.91 కోట్లు నేరుగా ఖర్చు చేయడం జరిగిందన్నారు.
ప్రజా సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. NTR భరోసా పెన్షన్ ద్వారా 3.38 లక్షల మందికి రూ.3,668.74 కోట్లు, తల్లికి వందనం కింద 92,105 కుటుంబాలకు రూ.138 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ద్వారా 67,852 మంది విద్యార్థులకు రూ.165 కోట్లు, దీపం-2 పథకం ద్వారా 12.66 లక్షల కుటుంబాలకు రూ.221.36 కోట్లు అందించడం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే ఆటో డ్రైవర్ సేవలో, మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్, ఇమామ్‌లు, మౌజన్లు, పాస్టర్ల గౌరవ వేతనాలు, PMJVK, హజ్ యాత్ర, రంజాన్, హైటీ, మైనారిటీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంతో పాటు, CEDM ద్వారా 10,543 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి మైనారిటీల సామాజిక, విద్యా, ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదన్నారు.
విద్య ద్వారా సాధికారతకు విశేష ప్రాధాన్యం
విద్యే మైనారిటీల సాధికారతకు ప్రధాన సాధనంగా భావిస్తున్న ప్రభుత్వం, “తాలిమ్-ఎ-హునర్” పథకం ద్వారా 250 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు రూ.6 కోట్ల వ్యయంతో కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యను అందిస్తోందన్నారు. అలాగే TETకు 4,300 మంది, DSC-2025కు 1,780 మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించగా, వారిలో 435 మంది కాల్ లెటర్లు పొందారన్నారు. అదేవిధంగా 350 మంది విద్యార్థులకు NEET & EAMCET కోచింగ్, 7,000 మంది SSC ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉచిత వర్కుబుక్‌లు అందించడంతో పాటు, CEDM Online Studio మరియు CEDM App ద్వారా ఆధునిక ఆన్‌లైన్ కోచింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.
వక్ఫ్ ఆస్తుల రక్షణలో చారిత్రాత్మక చర్యలు
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, నిర్వహణలో ప్రభుత్వం కీలక విజయాలు సాధించిందన్నారు. 1,500 వక్ఫ్ సంస్థల సర్వేను పూర్తి చేయడంతో పాటు, 88 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తొలిసారిగా 616.65 ఎకరాల వక్ఫ్ భూమికి తహసీల్దార్ల ద్వారా లీజు వేలం నిర్వహించగా, 5,028 వక్ఫ్ సంస్థల వివరాలను సెంట్రల్ పోర్టల్‌లో నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే వక్ఫ్ సంస్థల నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.5.74 కోట్లు విడుదల చేసి వాటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.
హజ్ యాత్రికులకు ఆదర్శవంతమైన సేవలు
హజ్ యాత్రికులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, హజ్-2025లో 1,630 మంది, హజ్-2026లో 1,990 మంది యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. విజయవాడ ఎంబార్కేషన్‌ను ప్రోత్సహిస్తూ 2025లో 72 మందికి రూ.72 లక్షలు, 2026లో 331 మందికి రూ.3.31 కోట్లు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, లగేజీ ఆలస్యమైన 177 మంది యాత్రికులకు రూ.24.40 లక్షల నష్టపరిహారాన్ని విమానయాన సంస్థ ద్వారా ఇప్పించి యాత్రికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
PMJVK, PM-VIKAS ద్వారా మౌలిక వసతులు –నైపుణ్యాభివృద్ధి
PMJVK కింద రూ.231 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం, 2026-27లో రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందన్నారు. తొలి విడతలో రూ.101 కోట్లతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, 5 పాలిటెక్నిక్ కళాశాలలు, అనంతపురంలోని KGN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అదనపు భవనం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా PM-VIKAS పథకం ద్వారా రూ.10.60 కోట్లు సమీకరించి 1,500 మందికి నైపుణ్య శిక్షణ అందిస్తోందన్నారు.
ఉర్దూ భాషాభివృద్ధి – డిజిటల్ శిక్షణకు ప్రోత్సాహం
ఉర్దూ భాషాభివృద్ధికి ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో “ఆవో ఉర్దూ సీఖేన్” సమ్మర్ క్యాంపు, “సురూర్-ఎ-ఉర్దూ” మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 36 కంప్యూటర్ శిక్షణా కేంద్రాల ద్వారా 8,080 మందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు. అలాగే శిక్షణా కేంద్రాల ఆధునీకరణ కోసం 216 కంప్యూటర్ల కొనుగోలుకు రూ.2.75 కోట్లు వ్యయం చేస్తూ డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
మైనారిటీల సంక్షేమంలో సంస్థాగత బలోపేతం
వక్ఫ్ బోర్డు, మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను నియమించామని తెలిపారు. శ్మశానవాటికలు, ఈద్గా స్థలాల కేటాయింపు, ప్రభుత్వ ఖాజీల నియామకం, పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ చెల్లుబాటు గడువును 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచే ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.
న్యాయపాలన బలోపేతానికి సంస్కరణలు
గత రెండేళ్లలో లా శాఖ వేగవంతమైన, పారదర్శకమైన న్యాయపాలన కోసం విస్తృత సంస్కరణలు అమలు చేయడం జరిగిందన్నారు. రూ.216 కోట్లతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతులు, 1,173 మంది మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46.92 కోట్ల ఆర్థిక సహాయం, న్యాయ మిత్ర పథకంలో స్టైఫండ్‌ను రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు, 19 చట్టాల సమీక్ష ద్వారా 16 చట్టాల్లో వివక్షాత్మక నిబంధనల తొలగింపు, ఆంధ్రప్రదేశ్ జన విశ్వాస్ చట్టం–2026 రూపకల్పన, 10,750 ఫైళ్ల సకాల పరిష్కారం, అలాగే 70 చట్టాలు, 18 ఆర్డినెన్సుల రూపకల్పన, తెలుగు అనువాదం వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు.
న్యాయవాదుల సంక్షేమం – కోర్టుల బలోపేతం
న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 61 సంవత్సరాలకు, హైకోర్టు న్యాయమూర్తుల గ్రాట్యుటీని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచామన్నారు. అలాగే 263 మంది ప్రభుత్వ న్యాయాధికారులను నియమించి రూ.31.58 కోట్ల గౌరవ వేతనాలు చెల్లించడంతో పాటు, 86 మంది AGPల గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచడం జరిగిందన్నారు. స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం, భత్యాలు పెంచడంతో పాటు 216 పారా లీగల్ వాలంటీర్ల నియామకానికి రూ.5.91 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు.
2026-27 లక్ష్యాలు
2026-27 సంవత్సరంలో మైనారిటీల సంక్షేమం, న్యాయపాలన, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వనుందన్నారు. PMJVK కింద రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులు, రూ.205 కోట్లతో సుమారు 30,000 మందికి నైపుణ్య శిక్షణ, సబ్సిడీతో స్వయం ఉపాధి, PM-VIKAS ద్వారా 1,500 మందికి శిక్షణ, 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1,770 మంది సిబ్బంది నియామకం, కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో విద్య, డిజిటల్ నైపుణ్యాలు, న్యాయపాలన, మౌలిక వసతులు మరియు మైనారిటీల సాధికారతను మరింత వేగవంతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో లా సెక్రటరీ జి.ప్రతిభాదేవి, మైనారిటీ సెక్రటరీ బి.శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News