-బనగానపల్లె నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాకరించాలని కోరిన మంత్రి
-మంత్రి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించి, సహాకరిస్తామని హామీ ఇచ్చిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎండీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద నిధులు విడుదల మంజూరు చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ వంశీ రామమోహన్ ను రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో గల పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగు వ్యక్తి బుర్రా వంశీ రామ మోహన్ తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎండీని శాలువాతో సత్కరించి, వినాయకుని ప్రతిమను ఆయనకు అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సమావేశంలో నంద్యాల జిల్లాలో తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న బనగానపల్లె నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో బనగానపల్లె ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద నిధులు విడుదల చేయాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వర్షాకాలంలో జుర్రేరు వాగు వరద ప్రవాహం వల్ల స్థానిక నివాస ప్రాంతాలు, వ్యవసాయ పంట భూములు ముంపునకు గురవుతున్న విషయాన్ని మంత్రి సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. జుర్రేరు వాగు సుందరీకరణ, వరద నివారణ కోసం రూ. 4.95 కోట్లతో చేపట్టదలచిన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు రూ. 2 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలను సిఎస్ఆర్ నిధుల కింద సమకూర్చాలని కోరారు.
మంత్రి ప్రతిపాదనలపై పవర్ గ్రిడ్ సీఎండీ బుర్రా వంశీ రామ మోహన్ సానుకూలంగా స్పందించారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా బనగానపల్లె ప్రాంత అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పవర్ గ్రిడ్ సంస్థ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని, కొత్త ప్రాజెక్టులతో ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి ఆహ్వానించారు.
Prajavartha Online Telugu News