-మొహర్రం వేడుకలకు ప్రభుత్వం అండ..139 ఆస్థానాలకు రూ.7.45 లక్షల చెక్కుల పంపిణీ
-మత సామరస్యానికి ప్రతీకగా మచిలీపట్నం
-హజ్ యాత్రికులు, మసీదులు, కమ్యూనిటీ హాల్‌కు ప్రభుత్వ సహకారం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మొహర్రం సందర్భంగా మచిలీపట్నం నగరంలోని రాజుపేట షాదిఖానాలో శుక్రవారం నిర్వహించిన ఆస్థానాలకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మొహర్రం సందర్భంగా ఆస్థానాల మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది నియోజకవర్గంలోని 139ఆస్థానాలకు రూ.7.45 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఆస్థానాల వద్ద అవసరమైన చోట్ల మట్టి, విద్యుత్ దీపాలు తదితర మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద ఎత్తున మొహర్రం కార్యక్రమాలు మచిలీపట్నంలోనే జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవడం మచిలీపట్నం ప్రత్యేకత అని కొనియాడారు.
మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ద్వారా 250 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తుండగా, వక్ఫ్ బోర్డు ద్వారా 500 మంది విద్యార్థుల విద్య కోసం రూ.6.25 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. హజ్ యాత్రికులకు సబ్సిడీతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మందిని యాత్రకు పంపినట్లు వెల్లడించారు.
షియా ముస్లింల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తిరిగి కేటాయించి నిర్మాణ పనులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. మీజాన్ మీరాజ్ జుమా మసీదు ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. గతంలో కబరస్తాన్లు, స్మశానాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులు అందించిందన్నారు.
మైనారిటీలకు అవసరమైన ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మత సామరస్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మొహర్రం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రార్థనలు రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం, ప్రజల సుభిక్షానికి దోహదపడాలని ఆకాంక్షించారు.
ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. మొహర్రం సందర్భంగా ఆస్థానాల నిర్వహణ, మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని ఆస్థానాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. షాదీఖానాల అభివృద్ధి, ముస్లిం మైనారిటీల సంక్షేమం, వారి అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తోందన్నారు.
మొహర్రం సందర్భంగా జిల్లాలోని ఆస్థానాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అర్హులైన ఆస్థానాలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముస్లిం సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ.. మొహర్రం సందర్భంగా ఆస్థానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ముస్లిం సోదరులు తమ మత సంప్రదాయాలను ప్రశాంతంగా, ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్య పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ముస్లిం మత పెద్దలు మౌలానా, మీర్జా రషీద్ మౌలానా, ఖాజీ, మీర్జా మున్షీ మహమ్మద్, మైనార్టీల సంక్షేమ శాఖ జిల్లా అధికారి రబ్బాని, కూటమి నాయకులు సుధాకర్, ఇలియాజ్ పాషా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News