-ప్రజా దర్బార్‌లో అందిన 540 అర్జీల్లో 447 పరిష్కారం.. మిగిలిన వాటిపైనా ప్రత్యేక దృష్టి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం నగరంలోని బృందావన్ థియేటర్ పక్కన ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 540 అర్జీలు అందగా, వాటిలో 447 అర్జీలను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. మరో 77 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 55 అర్జీలు గడువులోనే ఉండగా, గడువు దాటిన 22 అర్జీల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి త్వరితగతిన పరిష్కరిస్తామని వెల్లడించారు.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో, ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని, రహదారుల మరమ్మతులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పునరుద్ధరణ, పంచాయతీరాజ్ శాఖ నిధులతో గ్రామీణ రహదారులు, డ్రైనేజీల అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.
మచిలీపట్నం పట్టణంలో దాదాపు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని 34 గ్రామ పంచాయతీల్లో దశలవారీగా ప్రతి ఇంటికీ నాణ్యమైన తాగునీరు అందించే కార్యక్రమాన్ని ఏడాదిలోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆధునిక సాంకేతికత కలిగిన నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి రానున్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు.
సామాజిక మాధ్యమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించాలని మంత్రి సూచించారు. తప్పుడు ప్రచారం, అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ప్రతి ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు.
అర్జీలలో కొన్ని:
* గోసంఘం టిడ్కో గృహాల్లో 600 మందికి పైగా నివాసం ఉంటున్నప్పటికీ ప్రస్తుతం రోజు విడిచి రోజు మాత్రమే తాగునీరు సరఫరా చేస్తున్నారని, దీంతో విద్యార్థులు, ఉద్యోగాలు మరియు ఇతర పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జి. నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ తాగునీరు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్రకు అర్జీ సమర్పించారు.
* మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం చిన్నగ్రహారం ప్రాంతంలోని సర్వే నంబర్ 249/10లో ఉన్న ఎకరా 28 సెంట్ల భూమికి సంబంధించిన నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదని తోట రామారావు తెలిపారు. తన ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో తనకు రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్రకు అర్జీ ద్వారా విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ హసీం బేగ్, మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, ఇలియాజ్ పాషా తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News