-పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఒక్కో నియోజకవర్గంలో వరుసగా నాలుగు వారాల పాటు “ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.
శుక్రవారం పామర్రు నియోజకవర్గంలోని పామర్రు ఎస్‌కేఆర్‌ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా, కె ఆర్ ఆర్ సి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పి నీలకంఠేశ్వరరెడ్డితో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రతిసారీ మచిలీపట్నంలోని కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా వారి నియోజకవర్గానికే అధికారులు వస్తున్నారని తెలిపారు. నాలుగు వారాల పాటు నిరంతరంగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా అధికారులకు ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సమీక్షించి, పరిష్కారం కాని సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించదగిన ప్రతి సమస్యను నిర్ణీత గడువులో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అర్జీలలో కొన్ని:
* పమిడిముక్కల మండలం, మర్రివాడ గ్రామంలోని రైవస్–పుల్లేరు కాలువల సంగమం వద్ద ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో, ఎలమర్రు, చినపారుపూడి, సాయిపురం గ్రామాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, వంతెన సమస్యకు పరిష్కారం చూపి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
* మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో అంతర్గత రహదారులు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
* పామర్రు మండలం, యలకుర్రు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు, తమ గ్రామంలోని 33 డ్వాక్రా గ్రూపులకు బుక్ కీపర్‌గా పనిచేస్తున్న కనకమేడల జ్యోతి బ్యాంకు రుణాలు, పొదుపు నిధులను గ్రూపు ఖాతాల్లో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సభ్యులకు న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.
* పమిడిముక్కల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన డి. వెంకటేశ్వరరావు 2014లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో వెన్నెముక తీవ్రంగా దెబ్బతిని గత 12 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. తన శారీరక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం అందిస్తున్న రూ.15 వేల ప్రత్యేక పెన్షన్ మంజూరు చేయడంతో పాటు, అవసరమైన వైద్య ధృవీకరణ పత్రం జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News