-వేగవంతమైన వైద్యసేవలతో ప్రజారోగ్యానికి అండగా 108
-ప్రతి అంబులెన్స్‌లో అత్యవసర మందులు, వైద్య పరికరాలు సిద్ధం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలం సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశాల నేపథ్యంలో ప్రజలకు సకాలంలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు 108 అంబులెన్స్ సేవలు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలానుగుణ వ్యాధులతో పాటు పాములు, తేళ్లు, ఇతర విష కీటకాల కాట్లు, విద్యుత్ ప్రమాదాలు, నీటిలో మునిగే ఘటనలు పెరిగే అవకాశం అవకాశం ఉంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అడవులకు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అత్యవసర వైద్య సేవలు వేగంగా అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, నీటిమునక ప్రాంతాలు ఏర్పడటం వంటి పరిస్థితుల్లోనూ బాధితులకు వీలైనంత త్వరగా వైద్య సహాయం అందించేందుకు 108 బృందాలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.
గోల్డెన్ అవర్ లో స్పందన
వర్షాకాల అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 108 అంబులెన్స్‌లలో అవసరమైన అత్యవసర మందులు, ఆక్సిజన్, ప్రాథమిక ప్రాణరక్షక పరికరాలు, ఇతర వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి స్పందించేలా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (EMTs), పైలట్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. గోల్డెన్ అవర్‌లో బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు.
ప్రాణాధారంగా 108
గత ఏడాది (జూలై 2025–జూన్ 2026) కాలంలో 108 సేవలు వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వేలాది మందికి ప్రాణాధారంగా నిలిచాయి. ఈ కాలంలో జ్వరానికి సంబంధించిన 28,933 అత్యవసర కేసులు, జంతువులు/విష కీటకాల కాట్లకు సంబంధించిన 14,353 కేసులు, విద్యుత్ షాక్‌కు సంబంధించిన 2,194 కేసులు, నీటిలో మునిగిన 718 కేసులు, పిడుగుపాటుకు సంబంధించిన 96 కేసులకు సకాలంలో స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించాయి. ఈ గణాంకాలు వర్షాకాలంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి అందే వైద్య సహాయమే ప్రాణాలను కాపాడగలదని ఈ ఘటనలు మరోసారి నిరూపించాయి.
వర్షాకాలంలో ముఖ్యంగా పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే భారీ వర్షాల సమయంలో నీటిలో మునిగే ప్రమాదాలు, విద్యుత్ తీగలు తెగిపడటం వల్ల విద్యుత్ షాక్ ఘటనలు, వైరల్ జ్వరాలు వంటి అత్యవసర పరిస్థితులు కూడా పెరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా వెంటనే 108 సేవలను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక చికిత్సలపై ఆధారపడకుండా వైద్య నిపుణుల సహాయం పొందడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయి.
ప్రజారోగ్యమే లక్ష్యం
ఈ సందర్భంగా భవ్య హెల్త్ కేర్ మీడియా కోఆర్డినేటర్ మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడడమే 108 సేవల ప్రధాన లక్ష్యమని తెలిపారు. వర్షాకాలంలో ఎదురయ్యే ప్రతి అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండేలా అంబులెన్స్‌లు, సిబ్బంది, వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని చెప్పారు. పాము లేదా విష కీటకం కాటు, విద్యుత్ షాక్, నీటిలో మునిగే ప్రమాదం, తీవ్ర జ్వరం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే 108కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల అప్రమత్తతతో పాటు సమయానికి అందే అత్యవసర వైద్య సేవలే అనేక ప్రాణాలను కాపాడగలవని పేర్కొన్నారు.
వర్షాకాలంలో ప్రజలకు 108 సూచనలు
వానాకాలంలో ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
దోమల నివారణ చర్యలు చేపట్టాలని, శుద్ధి చేసిన తాగునీరు మాత్రమే వినియోగించాలి
అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని లేదా వైద్యులను సంప్రదించాలి
పాము లేదా విష కీటకం కాటు పడితే స్థానిక చికిత్సలకు వెళ్లకుండా వెంటనే 108కు కాల్ చేయాలి
నీటిలో మునిగిన వ్యక్తికి వీలైనంత త్వరగా అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి
తెగిపడిన విద్యుత్ తీగలు లేదా నీటిలో ఉన్న విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి
అధిక జ్వరం, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి
భారీ వర్షాలు, వరదల సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి
జారీ చేసిన వారు
మీడియా కోఆర్డినేటర్
108 భవ్య హెల్త్ కేర్అ త్యవసర అంబులెన్స్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Prajavartha Online Telugu News