Breaking News

నీటి భద్రత కోసం స్థానిక నీటి వనరుల బేసిన్ల అనుసంధానం

-మైక్రో బేసిన్ల కనెక్టివిటీపై పూర్తిస్థాయి అధ్యయనం
-కుప్పం నుంచి జలధార- జలహారతి పనులపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జలధార- జలహారతి పనుల్ని నిర్దేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా జలధార- జలహారతిపై సమీక్ష నిర్వహించారు. గడచిన ఐదు రోజులుగా జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న 100 రోజుల గడువులోగా మంజూరు చేసిన పనుల్ని పూర్తి చేసి తీరాలని దిశానిర్దేశం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాల్లో నీటి భద్రత కోసం వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించేందుకు ప్రయత్నం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మిగులు నుండి లోటు ప్రాంతాలకు నీటిని తరలించి స్థానిక నీటి అవసరాలకు నిల్వ సామర్ధ్యాన్ని మెరుగు పరచాలని సూచించారు. ఆమేరకు మిగులు నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించేలా అనుసంధాన పనుల్ని చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించే అవకాశముంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మైక్రో బేసిన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రీయ డేటా ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించారు. మైక్రో-బేసిన్ అనుసంధాన ప్రక్రియలపై అధ్యయనం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు.

ఉత్తమ విధానాల అమలు

నీటి భద్రత సాధించేందుకు, భూగర్భ జలాల పెంపునకు వివిధ జిల్లాల్లో అనుసరించిన ఉత్తమ విధానాల్ని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో అనుసరించిన ఉత్తమ విధానాల్ని, విజయవంతమైన పద్ధతుల్ని డాక్యుమెంట్ చేయాలని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో సాధ్యమైన చోట బెస్ట్ ప్రాక్టీసెస్ ను అనుసరించాలన్నారు. కాస్కేడ్ వ్యవస్థలను కూడా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లా కలెక్టర్లు ప్రదర్శించిన కాస్కేడ్ పునరుద్ధరణ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి అభినందించారు. భూగర్భ జలాల రీఛార్జితో పాటు ఉపరితల నీటి లభ్యతను పెంచేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో కాస్కేడ్ వ్యవస్థలను గుర్తించి పునరుద్ధరించాలని సీఎం స్పష్టం చేశారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ప్రణాళికలపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. సరైన నీటి నిర్వహణతో పాటు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా జలవనరుల శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.

జలధార- జలహారతిపై నివేదిక

ప్రత్యేకించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జలధార- జలహారతి కార్యక్రమంతో వచ్చిన ఫలితాలను అంచనా వేసేందుకు ఓ శాస్త్రీయపరమైన విశ్లేషణ చేపట్టాలని సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భ జలాలల ప్రభావానికి సంబంధించిన అంశంపై లోతుగా పరిశీలన చేపట్టాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు.
ఈ అంశాలను అధ్యయనంతో పాటు తదుపరి చర్యల కోసం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు జలవనరుల ప్రణాళికల్ని అమలు చేసేందుకు డేటా ఆధారిత నమూనాల ద్వారా చేపట్టాలన్నారు. 100 రోజుల జలధార- జలహారతి కార్యక్రమం పూర్తి అయ్యాక ఆయా జిల్లాల్లో పనుల పరిస్థితి, ఆర్ధిక వ్యయం, వర్షపాత విశ్లేషణ, భూగర్భ జలాల రీఛార్జి, నీటి నిల్వ సామర్ధ్యంలో మెరుగుదల తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు సహా అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *