– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమ దైనందిన జీవన భృతి కోసం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతై, వారి సమాచారం ఇప్పటివరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. అవసరమైతే అదనపు నౌకలు, హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించి, గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి రక్షించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. మరోవైపు తీవ్ర ఆందోళనలో ఉన్న బాధిత మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన భరోసా కల్పించి, ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News