-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విస్తృత పర్యటనలు
-క్షేత్ర స్థాయిలో కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం
-ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పై ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ క్రమంలో బీఎల్వోలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
ఆదివారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ మధ్య నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్, దేవీ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. స్పెషల్ డ్రైవ్ గా చేపడుతున్న కార్యకపాపాలను పరిశీలించారు. హెల్ప్ డెస్కులు ద్వారా ఓటర్లకు అందుతున్న సహాయ సహకారాలను పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి దిశానిర్దేశం చేశారు.
ఫారాలు నింపడంలో, సమర్పించడంలో సహాయం చేయడానికి అందుబాటులో ఉన్న హెల్ప్ డెస్కులను సద్వినియోగం చేసుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో 16,80,998 (98.11 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 8,43,301 (49.22 శాతం) ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. తిరువూరులో 1,36,700 (65.50 శాతం) డిజిటైజేషన్ జరగ్గా.. విజయవాడ పశ్చిమలో 95,602 (37.20 శాతం), విజయవాడ సెంట్రల్ 1,10,622 (39.82 శాతం), విజయవాడ తూర్పు 1,13,481 (42.07 శాతం), మైలవరం 1,69,551 (59.46), నందిగామ 1,16,272 (56.04 శాతం), జగ్గయ్యపేటలో 1,01,073 (48.70 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియమనిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించేలా ఎలాంటి ప్రభావాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News