-మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఉత్తమ చికిత్స
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అన్నమయ్య జిల్లాకు చెందిన చిన్నారి చంద్రిక (6)ను ఆదివారం తిరుపతి రుయాలో చేర్పించారు. మొలకలచెరువుకు చెందిన చంద్రిక చర్మ సంబంధ అరుదైన వ్యాధితో బాధపడుతుండడం గురించి తెలిసిన వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ జారీచేసిన ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య నేతృత్వంలో వైద్య బృందం శనివారం నేరుగా ఇంటికి వెళ్లి బాలికను పరీక్షించింది. జీరో డెర్మా పిగ్మెంటోసమ్ అనేది సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలకు తీవ్రంగా స్పందించే ఒక అరుదైన జన్యుపరమైన చర్మ వ్యాధితో చంద్రిక బాధపడుతోన్నట్లు వైద్యులు గుర్తించారు. బాలికను వెంటనే రుయాలో చేర్పించి, ఉత్తమ వైద్య సేవలు అందించాలని మంత్రి సత్యకుమార్ జారీచేసిన ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం చంద్రికను రుయాలోని పిల్లల విభాగంలో చేర్పించారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నుంచి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా బాలికను తిరపతి తీసుకొచ్చారు. ముఖ్యoగా కంటి దగ్గర ఉన్న వాపు ప్రభావాన్ని గురించి తెలుసుకునేందుకు బయాప్సీ చేయాలని వైద్యులు తెలిపారు. చర్మవ్యాధులు, ఆంకాలజిస్టు వైద్యులు కూడా బాలికను పరీక్షిస్తున్నారు. బయాప్సీ నివేదిక అనుసరించి కంటి దగ్గర ఉన్న వాపునకు చికిత్స అందించనున్నారు. జీరో డెర్మా పిగ్మెంటోస మ్ రోగులు ఎండలో ఉంటే చర్మంపై బొబ్బలు ఏర్పడతాయి. ముఖం, చేతులపై చిన్నచిన్న నల్లటిమచ్చలు రావడం, చర్మం పొడిగా, పలుచగా మారడo జరుగుతోంది. కళ్ళు ఎర్రబడటం, కాంతిని చూడలేకపోవడం, కంటి శుక్లం ఏర్పడే అవకాశం ఉంది. చంద్రిక కుటుంబంలో ఈ వ్యాధి వారసత్వంగా వస్తోంది.
Prajavartha Online Telugu News