-వైకల్యంపై స్వీయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి!
-ఆసుపత్రుల్లో హాజరు నమోదు అనంతరమే పరీక్షలు
-8 నుంచి స్లాట్ బుకింగ్
-13 నుంచి వైకల్య నిర్ధారణ పరీక్షలు
-ఏపీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుడు నేరుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం
-ఈ అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతులు) వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, స్నేహాపూర్వకంగా నిర్వహించేందుకు వీలుగా కీలక సంస్కరణలను అమలుచేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులు వ్యయప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్రాన్ని యూనిట్ గా కాకుండా స్లాట్ బుకింగ్ ను జోనల్ స్థాయిలో చేసుకోవడానికి వీలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే స్లాట్ బుకింగ్లో తప్పుడు విధానాన్ని అనుసరించకుండా ఉండేందుకు ‘సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ హామీపత్రం) విధానాన్ని, సదరం కింద వైకల్య పరీక్షలు జరిగేందుకు ముందుగానే ఆన్లైన ద్వారా దివ్యాంగుల తప్పనిసరి హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి ‘స్లాటు’ బుకింగ్ విధానాన్నిపునరుద్ధరించబోతున్నామని, వీటితోపాటే కీలక మార్పులు అమల్లోనికి వస్తాయని నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంపై వైద్యులు, అధికారులపై పనిఒత్తిడి తగ్గుతుందని, దివ్యాంగులకు ప్రయాణపరంగా వెసులుబాటు ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఈనెల 13 నుంచి ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. గడిచిన తొలి త్రైమాసికoలో 80వేల మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు స్లాట్ బుకింగ్ అవకాశాన్ని కల్పిస్తారు.
ఈ నేపథ్యంలో అమలులోనికి తేనున్న సంస్కరణలపై దివ్యాంగుల్లో అవగాహన కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధర్ బాబు హెచ్ ఓ డి లకు జిల్లా అధికారులకు ఆదేశాలు పంపించారు. సదరం పోర్టల్ లో అవసరమైన మార్పులు కూడా చేస్తున్నారు.
జోనుల వివరాలు
ప్రస్తుత విధానంలో దివ్యాంగులు రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా వైకల్య పరీక్షల కోసం స్లాటుబుకింగ్ చేసుకోవడానికి వీలుంది. ఇకపై ఈ విధానాన్ని జోనల్ స్థాయికి పరిమితంచేశారు. అభ్యర్థులు తమ జిల్లాకు దగ్గర్లోని (జోనల్ ప్రతిపాదికన) జిల్లాల్లో మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జోన్-1 : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం
జోన్-2
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ.
జోన్-3 : పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పోలవరం
జోన్-4 : గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,
జోన్-5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్-6 : నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి.
ప్రస్తుత సమస్యలు
సొంత జిల్లాలో అసెస్‌మెంట్ స్లాట్‌లు అందుబాటులో లేకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు దూర జిల్లాల్లో అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది.
దీని ఫలితంగా సదరం ఐడీలను బదిలీ చేయాలంటూ పదేపదే విజ్ఞప్తులు, పరిపాలనాపరమైన సమస్యలు, అనవసర ప్రయాణ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
-అభ్యర్థులకు తమ వైకల్య స్వభావంపై స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుదారులు సంబంధం లేని వైకల్య కేటగిరీని ఎంపిక చేసుకుంటున్నారు. దీనితో అసెస్‌మెంట్‌లు రద్దవుతూ, పరిమిత స్పెషలిస్ట్ స్లాట్‌లు వృథా అవుతున్నాయి. హాజరు నమోదు వ్యవస్థ లేకపోవడంవల్ల భౌతిక ధృవీకరణలో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి.
పరిష్కారానికి కొత్త సంస్కరణలు –
*జోనల్ స్లాట్ బుకింగ్ విధానం*
దరఖాస్తుదారులు తమకు కేటాయించిన జోన్‌లో మాత్రమే అసెస్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేసుకోగలిగే విధంగా జోనల్ స్లాట్ బుకింగ్ విధానాన్ని సిద్ధం చేశారు.
దీని ద్వారా అభ్యర్థులు తమ సొంత జిల్లాలో లేదా అదే జోన్‌లోని పొరుగు జిల్లాలో సేవలు పొందవచ్చు. దీనివల్ల స్లాట్‌ల సమాన పంపిణీ, ప్రయాణ భారం తగ్గింపు, దాదాపుగా పరిపాలనాపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి
తప్పుడు (ఫాల్స్) బుకింగ్ నిరోధానికి సెల్ఫ్ డిక్లరేషన్
ప్రతి కొత్త దరఖాస్తుదారుడు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో తప్పనిసరిగా స్వీయ ధ్రువీకరణ (Self-Declaration) పత్రం సమర్పించాల్సి ఉంటుంది. వైకల్య కేటగిరీ స్పష్టంగా గుర్తించలేని సందర్భాల్లో, బుకింగ్‌కు ముందు అర్హతగల జనరల్ ఫిజీషియన్ నుంచి ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలి. దీనివల్ల స్లాట్ బుకింగ్ ద్వారా సదరు వైద్యుల వద్దకు పరీక్షల నిమిత్తం వెళ్తారు. దీనివల్ల అందుబాటులో ఉన్న అసెస్‌మెంట్ స్లాట్‌ల వినియోగం మెరుగవుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్, డాక్టర్ సర్టిఫికేట్ నమూనాను ఏపీ సేవా, సదరం పోర్టల్ లో అందుబాటులో ఉంచుతున్నారు.
అసెస్‌మెంట్ క్యాంప్‌లో హాజరు నమోదు తప్పనిసరి
అమలుకు తగ్గట్లు చర్యలు తీసుకున్నారు. దరఖాస్తుదారులు అసెస్‌మెంట్‌కు ముందు సదరం పోర్టల్‌లో తమ హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హాజరు నమోదుతోనే సదరం ఐడీ యాక్టివేషన్ ముడిపడి ఉంటుంది. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి, భౌతిక ధృవీకరణ సులభతరం అవుతుంది.
దరఖాస్తుదారులకు మొదటి సంప్రదింపు కేంద్రంగా ఉన్న సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు అవగాహన కల్పిస్తున్నారు.
సిటిజన్ లాగిన్ ద్వారా నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
కూటమి ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ సేవను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. సదరం అసెస్‌మెంట్ స్లాట్ కావాల్సిన వారు తమ సమీప గ్రామ/వార్డు సచివాలయం ద్వారా గానీ, APSEVA పోర్టల్‌లో సిటిజన్ లాగిన్ సృష్టించుకోవడం ద్వారా ఎలాంటి రుసుము చెల్లించకుండా నేరుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
సిటిజన్ లాగిన్ సృష్టించేందుకు అవసరమైనవి: ఆధార్ నంబర్, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్.
APSEVA పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులు సదరం సేవల ద్వారా అసెస్‌మెంట్ స్లాట్ బుక్ చేసుకోవడం, వైకల్య ధృవీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం పూర్తిగా ఉచితం.
దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం, ప్రభుత్వ వాట్సాప్ ‘మన మిత్ర’ సేవల ద్వారా జిల్లాల వారీగా, వైకల్య వారీగా సదరం స్లాట్ లభ్యతను తెలుసుకోవచ్చు.
సేవలు ఉచితం
“సేవలు పూర్తిగా ఉచితం. స్లాట్ బుకింగ్ లేదా వైకల్య ధృవీకరణ పత్రాల జారీ కోసం అనధికార మధ్యవర్తులకు లేదా దళారులకు ఎలాంటి డబ్బు చెల్లించవద్దు ” అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు
Prajavartha Online Telugu News