-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు.
ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మున్సిపల్ సేవల కోసం రూపొందించిన “పురమిత్ర” యాప్‌లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఒక శాఖ నుండి మరో శాఖకు మళ్లించడం కాకుండా, సంబంధిత అధికారులు స్వయంగా స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాలని కమిషనర్ స్పష్టం చేశారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు 10, రోడ్ల ఆక్రమణలు వంటి అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు నమోదు కాగా, పబ్లిక్ హెల్త్ 2, ఇంజనీరింగ్ 3, పిఓ యుసిడి 4 ఫిర్యాదులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రతి ఫిర్యాదును అధికారులు స్వయంగా పరిశీలించి, ప్రజలకు స్పష్టమైన మరియు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె. శకుంతల, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News