-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సీ ప్రీవియషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా పాయకాపురం ప్రాంతంలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న SIR ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓల ద్వారా జరుగుతున్న ఫారాల సేకరణ, డేటా మ్యాపింగ్, ఆన్‌లైన్ ఎంట్రీ ప్రక్రియలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్‌హెచ్‌జీ నెట్‌వర్క్, బీఎల్ఓలను పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి అవసరమైన శిక్షణ అందించామని కమిషనర్ తెలిపారు. 2002 నాటి ఓటర్ల వివరాలు, తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి బీఎల్ఓ పరిధిలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్కడ ఆర్‌పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో ఉండి ఓటరు ఎక్కడ మ్యాప్ అయి ఉన్నారో గుర్తించడంలో ప్రజలకు సహాయం చేస్తున్నట్లు వివరించారు.
ఇప్పటివరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 45 శాతం ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనిని రాబోయే రెండు రోజుల్లో పూర్తి చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. మైక్ అనౌన్స్‌మెంట్లు, మీడియా ప్రచారంతో పాటు, స్థానికంగా అందుబాటులో లేని వారికి వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నామని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎవరికైనా సందేహాలు ఉంటే వెంటనే తమ పరిధిలోని సచివాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ కోరారు. అక్కడి సచివాలయ సెక్రటరీలు ఫారాలు ఎలా పూరించాలి, ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలి అనే విషయాలను వివరంగా తెలియజేస్తారన్నారు. ప్రజలకు సుపరిచితులైన ఆర్‌పీలు, సచివాలయ సిబ్బంది, అధికారులు కూడా అవసరమైన సహాయం అందిస్తారని స్పష్టం చేశారు.
ప్రజలు చురుకుగా పాల్గొని ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఎవరి వద్ద ఫారాలు ఉండి వాటిని పూరించడం తెలియకపోతే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే సిబ్బంది స్వయంగా వచ్చి తీసుకెళ్తారని, లేదా సమీప క్యాంపులోనే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేస్తారని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ కే. సంజయ్ రత్నకుమార్, సూపర్వైజర్లు, బీఎల్ఓలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News