-జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డా. కె. అర్జునరావు సూచనలతో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కొత్తపేట మరియు విద్యాధరపురం ప్రాంతాల్లో కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. డి. హరీష్ ఆధ్వర్యంలో మూడు నెలలకు పైబడిన వీధి కుక్కలు మరియు పెంపుడు కుక్కలకు మొత్తం 865 యాంటీ రేబిస్ టీకాలు వేశారు.
ఈ సందర్భంగా డా. డి. హరీష్ మాట్లాడుతూ జూనోసిస్ అనగా జంతువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులని తెలిపారు. రేబిస్, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు జూనోటిక్ వ్యాధులలో ముఖ్యమైనవని పేర్కొన్నారు. వీటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 6న నిర్వహించడం వెనుక ఉద్దేశ్యం జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమేనని తెలిపారు. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ మొట్టమొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా వినియోగించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి యాంటీ రేబిస్ టీకాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే పెంపుడు కుక్కలకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించడం యజమానుల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలకు రేబిస్ వ్యాధి నివారణ, వీధి కుక్కలతో వ్యవహరించాల్సిన విధానం, పెంపుడు జంతువుల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయించుకున్నారు.
Prajavartha Online Telugu News