– లిఖితపూర్వక అభిప్రాయాలు స్వీకరించనున్న గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశాలపై సమకాలీన, అనుభవాధారిత విచరణకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఛైర్మన్గా ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ నెల 7న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా అందుబాటులో ఉంటారని, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, మేధావులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, వినతిపత్రాలను స్వీకరించనున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల ప్రభావం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఇతర సంబంధిత అంశాలపై వ్యక్తులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు లిఖిత పూర్వక అభిప్రాయాలను నేరుగా సమర్పించవచ్చన్నారు. సంబంధిత వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News