-ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి హర్షం
-సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంపునకు ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంపునకు ప్రభుత్వ నిర్ణయం శుభ పరిణామం. ఇది విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు దోహదపడుతుంది. కూటమి పాలనలో పేద విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం. వైసీపీ హయాంలో హాస్టళ్లు, గురుకులాలు సమస్యలకు నిలయాలుగా ఉండేవి. రెండేళ్లలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాం. రూ.143 కోట్లతో 700 హాస్టళ్లకి మరమ్మతులు చేశాం. రూ. 58 కోట్లతో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అదనపు మరుగుదొడ్లు నిర్మించాం. పేద విద్యార్థుల్ని డాక్టర్లు, ఇంజనీర్లు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను పెంచాం. తిరుపతి, విజయవాడ, విశాఖ స్టడీ సర్కిళ్లలో 450 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాం. నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టాం. విదేశీ విద్యను అభ్యసించే అన్ని వర్గాల పేద విద్యార్థుల కోసం పథకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం. పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించేందుకు తమ ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడదని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
Prajavartha Online Telugu News