-మచిలీపట్నంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు.
గురువారం మచిలీపట్నం ఉత్తర మండలం తహసీల్దార్ కార్యాలయంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న రాజకీయ పార్టీల సమావేశాలకు తాను లేదా జాయింట్ కలెక్టర్ స్వయంగా హాజరవుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలకు ఉన్న సందేహాలు, అపోహలను నేరుగా నివృత్తి చేయడంతో పాటు సర్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు వారి సహకారం కోరడమే ఈ సమావేశాల ఉద్దేశమన్నారు.
జూలై 14తో మొదటి దశ ముగియనున్నందున మిగిలిన కొద్ది రోజుల్లో ఇంటింటి ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలు కొంతమంది ఓటర్ల వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే బీఎల్వోలకు అందజేయాలని కోరారు.
మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, డూప్లికేట్ నమోదులు, గుర్తించలేని ఓటర్లకు సంబంధించిన జాబితాలను ఇప్పటికే బీఎల్వోలు, బీఎల్ఏలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు అందజేశామని తెలిపారు. ఆ జాబితాల ఆధారంగా సంబంధిత వివరాలను గుర్తించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఎంతో శ్రమించి వేలాది మంది ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఫారాలు పంపిణీ చేసి తిరిగి సేకరిస్తున్నారని, వారికి బీఎల్ఏలు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మచిలీపట్నంలో చెత్త సేకరణ వాహనాల ద్వారా మైక్ ప్రకటనలు నిర్వహిస్తున్నామని, అదనంగా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ వద్ద ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిచేసి బీఎల్వోకు అందజేయాలని కోరారు. ఫారం నింపడంలో ఏవైనా సందేహాలు ఉంటే బీఎల్వోలను లేదా నియోజకవర్గ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సంఘం తరఫున అవసరమైన సహాయం అందించి ఫారాలను సేకరించే బాధ్యతను అధికారులు తీసుకుంటారని తెలిపారు.
ఆరోగ్యకరమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొన్న కలెక్టర్, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తిగా నిష్పక్షపాతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి రాజకీయ పార్టీ ఈ ప్రక్రియలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ అంశంపై కూడా చర్చించి, రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన సందేహాలకు జిల్లా కలెక్టర్ సమాధానాలు ఇచ్చారు.
మచిలీపట్నం నియోజకవర్గ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు:
ఎస్.ఐ.ఆర్. ప్రక్రియకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు, సహాయం అవసరమైనా లేదా ఇతర సమాచారం కోసం సంబంధిత హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
తహసీల్దార్ వారి కార్యాలయం, మచిలీపట్నం (నార్త్): 9640029918
తహసీల్దార్ వారి కార్యాలయం, మచిలీపట్నం (సౌత్): 8897733535
మున్సిపల్ కార్యాలయం, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్: 9398169847
అదేవిధంగా, కృష్ణా జిల్లా కాల్ సెంటర్ – 1950 నంబర్‌ను కూడా సంప్రదించి అవసరమైన సమాచారం, సహాయాన్ని పొందవచ్చని తెలిపారు.
సమావేశంలో మచిలీపట్నం నియోజకవర్గ ఈఆర్వో బందరు ఆర్డిఓ కే సాంబశివరావు, మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News