విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2027 ఫిబ్రవరి/ మార్చిలో జరగబోయే కృష్ణా ` గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబును ఎస్టియు మరియు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాధరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్టియు రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్ మరియు కార్యవర్గ సమావేశాలలో చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు విద్యార్థి దశలో విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు. 3 దశాబ్ధాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో ఎస్టియు మండల శాఖ బాధ్యునిగా, 13 సం॥లు గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, 8 సం॥ల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా, ఎపిజెఎసి సెక్రటరీ జనరల్‌గా, ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్‌గా ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానం కొనసాగించారు. 10వ పిఆర్సి నందు 43 శాతం ఫిట్మెంట్ సాధనలో, సిపిఎస్ ఉద్యమాల ద్వారా సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వుల సాధనలో, 2008 డిఎస్సి హామీపత్రాల ఉపాధ్యాయులకు ప్రత్యేక వేతన స్థిరీకరణ ఉత్తర్వుల సాధనలో, పండిట్, పిఇటి పోస్టుల ఉన్నతీకరణలో, రూ.398/` స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరులో, 2022 పిఆర్సి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు ని ఉపాధ్యాయ, అధ్యాపక, ఉద్యోగుల పెన్షనర్ల వాణిని శాసన మండలిలో బలంగా వినిపించుటకు కలిసి వచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించడం జరిగింది. ఎస్టియు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, గురుకుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు డా॥ కె.లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ నాయకులు సుబ్రమణ్యం, కె.జి.బి.వి. విభాగం నాయకురాళ్ళు రత్నమాలినీ దేవి, శేషాలత, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News