-యాప్‌ను ప్రతి రైతు వినియోగించాలి
-ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత
-ఉద్యాన, స్వల్పకాలిక వరి, అంతర పంటలకు ప్రాధాన్యం
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్) యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
గురువారం ఎ.కొండూరు మండలం చీమలపాడులోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంతో ఎరువులు సరైన సమయంలో, సరైన పరిమాణంలో పారదర్శకంగా అందుతున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు కూడా అందుతున్నాయన్నారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటలపై నిపుణుల సలహాలు, వ్యవసాయ శాఖ తాజా సమాచారం తదితర సేవలను మొబైల్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రతి రైతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని కోరారు.
పంటల వివరాల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులు అందించడం వల్ల ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతోందన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ప్రత్యేక సమాచార కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నంబర్ *91549 70454* లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఉద్యాన పంటలు, స్వల్పకాలిక వరి రకాలు, అంతర పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సూచించారు. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు పంట నష్టాల ప్రమాదం తగ్గి మెరుగైన దిగుబడి, ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు.
Prajavartha Online Telugu News