-వ్యర్థాలకు మంచి రేటు వచ్చే ఏర్పాట్లు
-నమస్తే పథకం అమలు
-డ్వాక్రా సంఘాల తరహాలో వేస్ట్ పిక్కర్స్ గ్రూపులు
-వాహనాలకు రుణాలు
-చెత్త ప్రాసెసింగ్లో వారికి అధిక లబ్ది
-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వేస్ట్ పిక్కర్స్(వ్యర్థాలను సేకరించేవారు) సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. గుంటూరులోని దళిత బహుజన రీసోర్స్ సెంటర్(డీబీఆర్సీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వేస్ట్ పిక్కర్స్ తో గురువారం ఆయన ముఖాముఖి మాట్లాడారు. వ్యర్థాల సేకరణ, వాటి అమ్మకాలు, ఒక రోజుకు వచ్చే ఆదాయం, రోజువారీ ఎదురయ్యే సమస్యలు వారిని అడిగి తెలుసుకున్నారు. వాటర్ బాటిల్స్, అట్టలు, న్యూస్ పేపర్, పాత ఇనుము వంటి వాటికి వ్యాపారులు తగిన ధర ఇవ్వడంలేదని వేస్ట్ పిక్కర్స్ చెప్పారు. వర్షా కాలంలో ధరలు మరీ తక్కువగా ఇస్తారన్నారు. ఉదయాన్నే లేచి ఖాళీ వాటర్ బాటిళ్లు, పేపర్లు ఏరుకునేవారు ఎంతమంది? ఆధార్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి? బ్యాంక్ అకౌంట్ ఎంతమందికి ఉంది? .. వంటి వివరాలను పట్టాభిరామ్ వేస్ట్ పిక్కర్స్ ని అడిగి తెలుసుకున్నారు.
వేస్ట్ పిక్కర్స్ సేకరించే వ్యర్థాలకు వారికి వచ్చే ధర, ఆ వ్యర్థాలు రీసైక్లింగ్ కేంద్రాలకు వెళ్లే సరికి నాలుగు రెట్లు పెరుగుతుందని చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మధ్యలో దళారులు లేకుండా వారికి ఎక్కువ ధర వచ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎన్యూమరేషన్ చేసి, వారి జీవన విధానం మెరుగుపరిచి, తగిన గుర్తింపు కల్పిస్తామన్నారు. అదేవిధంగా, వారు సేకరించే వ్యర్థాలను మంచి రేటుకు కొనుగోలు చేయడం ద్వారా వారి ఆదాయం పెంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. నమస్తే స్కీమ్ ద్వారా వారందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చర్యలు తీసుకుంటుందని పట్టాభిరామ్ చెప్పారు. వారికి హెల్త్ ఇన్సూరెన్స్.. వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వేస్ట్ పిక్కర్స్ ఆధ్వర్యంలో త్వరలో స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసి, వాటిని రీసైక్లింగ్ పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని పట్టాభిరామ్ చెప్పారు.
చెత్త ప్రాసెసింగ్ లో చెత్త సేకరించేవారికి అధిక లబ్ది చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవమానకరంగా చూసే పరిస్థితుల నుంచి వారు గౌరవంగా జీవించే విధంగా వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల తరహాలో వేస్ట్ పిక్కర్స్ గ్రూపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ గ్రూపుల ద్వారా రుణాలు అందజేసి, వారికి వాహనాలు సమకూర్చే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. చెత్త సేకరణ వ్యవస్థని మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేస్తుందన్నారు. ఈ ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో నిత్యం పనిచేస్తున్న వేస్ట్ పిక్కర్ల అభిప్రాయాలు, సూచనలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వేస్ట్ పిక్కర్ల సంక్షేమం విషయంలో డీబీఆర్సీ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీబీఆర్సీ కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడి దేవకుమార్, ప్రోగ్రామ్స్ మేనేజర్ సీహెచ్ శామ్యూల్ అనిల్ కుమార్, ఫైనాన్స్ మేనేజర్ జి.నాగలక్ష్మి, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తుల ఉత్పత్తిదారు హేమ సాయిబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వేస్ట్ పిక్కర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News