వైద్య సేవ‌ల్లో చిన్నపాటి అలసత్వాన్నీ సహించేది లేదు..

– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు త‌ప్ప‌వు
– ప్ర‌భుత్వ లక్ష్యాల‌కు అనుగుణంగా సేవ‌లందించాల్సిందే
– రోగుల నుంచి అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ వచ్చేలా సేవలందించాలి
– న్యూ జీజీహెచ్‌ను రాష్ట్రంలోనే నెం.1 ఆసుపత్రిగా నిల‌పాలి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్పష్టీక‌ర‌ణ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం విజయవాడ న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌ వార్డులు, ఐసీయూలు, ఔషధ పంపిణీ కేంద్రం, పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైద్యులు, అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి సంతృప్తి చెందేలా సేవలందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ సకాలంలో, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగుల నుంచి ఆసుపత్రిపై అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్ వచ్చేలా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వారి సమస్యలను ఓర్పుతో వినడం, చికిత్సలో ఎలాంటి జాప్యం లేకుండా చూడడం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని అన్నారు. న్యూ జీజీహెచ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ ఆసుపత్రిగా, నెం.1 ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల ప్రశంసలు పొందాలని సూచించారు. వైద్య, సంబంధిత సేవ‌లు అందించ‌డంలో ఆసుపత్రిలో ఎక్కడా నిర్లక్ష్యం, నిర్లిప్తతకు తావులేకుండా సేవలందించాలని పేర్కొన్నారు.
విధుల నిర్వహణలో చిన్నపాటి అలసత్వాన్ని కూడా సహించబోమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఈ తనిఖీల సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది వ్యవహారశైలిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందే విధంగా సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ స‌మావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ జి.ర‌ఘునంద‌న్‌, ఆసుప‌త్రి ప‌రిపాల‌న అధికారి కె.అప్పారావు, వివిధ విభాగాల అధిప‌తులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *