-ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చొరవ ఫలితం..
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన నిరంతర కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎంపీ ప్రతిపాదించిన రహదారి పనులకు గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు తన సమ్మతిని తెలియజేస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తక్షణ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు రూ.4.99 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం మంజూరు చేసినట్లు లేఖ ద్వారా ఎంపీకి తెలియజేశారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారులు నిర్మించబడనున్నాయి. వీటి ద్వారా ఇప్పటివరకు సరైన రహదారి సౌకర్యం లేని నాలుగు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుంది.
ఆమోదం పొందిన రహదారి పనులు ఇవి :
చిల్లకూరు మండలం: తీగపాలెం పీఆర్ రోడ్డు నుండి పల్లివానిదిబ్బ వరకు – 1.28 కి.మీ (రూ.1.51 కోట్లు)
డక్కిలి మండలం: మోపూరు రోడ్డు నుండి ఎం.వెల్లంపల్లి వరకు – 1.28 కి.మీ (రూ.1.39 కోట్లు)
సత్యవేడు మండలం: తడ–సత్యవేడు రోడ్డు నుండి వానెల్లూరు గ్రామం వరకు – 1.05 కి.మీ (రూ.1.04 కోట్లు)
శ్రీకాళహస్తి మండలం: శ్రీకాళహస్తి–ముసలిపేడు రోడ్డు నుండి వేదం పెద్దమిట్ట కండ్రిగ వరకు – 1.04 కి.మీ (రూ.1.05 కోట్లు)
ఈ రహదారి పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. అలాగే పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News