తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలను సృష్టించేందుకు కొందరు రాజకీయ శక్తులు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా గమనించాలని కోరారు.
రావణ్ అరెస్టు అంశంపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రస్తావించిన డా. పసుపులేటి హరిప్రసాద్, ఆ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, నారాయణ, ప్రకాశ్ రాజ్ తదితరులను ఉద్దేశించి “దుష్టచతుష్టయం”గా అభివర్ణిస్తూ విమర్శించారు. ప్రజల్లో అపోహలు, మత విద్వేషాలు, సామాజిక విభేదాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంలో ధర్మానికే ఎల్లప్పుడూ విజయం దక్కుతుందని అన్నారు. శ్రీరాముడు భారతీయుల ఆరాధ్య దైవమని, ధర్మానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటి దేశంలో అధర్మాన్ని సమర్థించే వ్యాఖ్యలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని డా. హరిప్రసాద్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడిపై రాజకీయ దురుద్దేశంతో వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. రావణ్ అరెస్టు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా కాదని, హిందూ మత విశ్వాసాలను అవమానించేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, హింసను ప్రేరేపించేలా, చట్టవిరుద్ధంగా భావించిన వ్యాఖ్యలపై నమోదైన కేసుల మేరకు పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, వారికి సహకరిస్తున్న శక్తులు, ఆర్థికంగా మద్దతు అందిస్తున్న వర్గాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖను కోరారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా, మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలను తిప్పికొట్టి రాష్ట్రంలో శాంతి, సామాజిక ఐక్యతను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News