ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు : యార్లగడ్డ వెంకట్రావు

-కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశా : యార్లగడ్డ
-ఎయిర్‌పోర్టు టెండర్‌లో నా ప్రమేయం నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : యార్లగడ్డ
-సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోంది..ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: యార్లగడ్డ
-ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీలో ప్రజాప్రతినిధిగా ప్రశ్నించా : యార్లగడ్డ
-ప్రత్యర్థులకు ప్రభుత్వ పనులు వెళ్లడంపై కార్యకర్తల్లో ఆవేదన ఉంది : యార్లగడ్డ
-టీడీపీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి : యార్లగడ్డ
-విజయ డెయిరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి : యార్లగడ్డ
-జూలై 17న ఉచిత AI–ML శిక్షణ కేంద్రం ప్రారంభం : యార్లగడ్డ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​
తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాదని, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సాక్షి మీడియా తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం విజయవాడ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు టెండర్ వ్యవహారంలో తన మనిషికి కాంట్రాక్ట్ ఇప్పించాలని ప్రయత్నించానంటూ సాక్షి పత్రిక, అనుబంధ మాధ్యమాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఖండించారు. తాను ఏ కంపెనీకి టెండర్ ఇప్పించాలని ఒత్తిడి తెచ్చానని లేదా సిఫార్సు చేశానని నిరూపిస్తే ఐదు నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు. ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌గా రెండు సంవత్సరాల తర్వాత జరిగిన సమావేశానికి హాజరయ్యానని, ఆ సమావేశంలోనే మిగిలిన పనులకు టెండర్ ఇవ్వడం, వ్యయం పెరగడం వంటి అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కూడా దీనిపై ప్రశ్నలు అడిగారని, ప్రజాధనం ఖర్చు అవుతున్నప్పుడు ప్రజాప్రతినిధిగా వివరాలు అడగడం తన బాధ్యతేనని అన్నారు. దీనిని ప్రభుత్వం వ్యతిరేక వ్యాఖ్యలుగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెబుతానని, డొంకతిరుగుడు రాజకీయాలు తనకు తెలియవని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి యార్లగడ్డ పలు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని దూషించిన వారిని జగన్ ఖండించి ఉంటే ఆయన రాజకీయ స్థాయి మరింత పెరిగేదన్నారు. బూతులు మాట్లాడే నాయకులను ప్రోత్సహించడం వల్లే వైఎస్సార్‌సీపీ నష్టపోయిందని, ఇప్పటికైనా అలాంటి వారిని దూరం పెట్టాలని జగన్‌కు హితవు పలికారు. కొడాలి నాని గతంలో మాట్లాడిన తీరు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరు భిన్నంగా ఉందని, ఒకే ధోరణితో మాట్లాడితేనే ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారు. జగన్‌ను తప్పుదోవ పట్టించింది ఈ జిల్లా మాజీ మంత్రులేనని ఆరోపించారు.
సాక్షి పత్రికపై తీవ్ర విమర్శలు చేసిన యార్లగడ్డ, తాను వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత దూషణలను సమర్థించలేదని చెప్పారు. సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి గురించి అనుచితంగా మాట్లాడిన వారినే తర్వాత పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించడం మానుకోవాలని, నిజాలు రాస్తేనే ప్రజలు నమ్ముతారని సూచించారు. తాను రాజకీయాల్లో వ్యక్తిత్వాన్నే ముఖ్యంగా భావిస్తానని, వ్యక్తిగత లాభాల కోసం ఎప్పుడూ వ్యవహరించలేదని అన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కోసం ఐదేళ్లపాటు పోరాడిన కార్యకర్తలు, కేసులు ఎదుర్కొన్న వారు, పార్టీ కార్యాలయం దాడి ఘటనలో జైలుకు వెళ్లిన వారిలో తీవ్ర ఆవేదన ఉందన్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలే ఇప్పుడు తమ సమస్యలను తన వద్దకు తీసుకొస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థులతో సంబంధాలు ఉన్న వారికి ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు దక్కుతున్నాయనే కార్యకర్తల అభ్యంతరాలను మాత్రమే పార్టీ దృష్టికి తీసుకెళ్లానని, అది పార్టీ వ్యతిరేక చర్య కాదన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి మనోభావాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వల్లభనేని వంశీ అనుచరుడిగా ఉన్న కడియాల సతీష్‌కు చెందిన బాబు ఎంటర్‌ప్రైజెస్‌కు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో రూ.8 కోట్ల చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ప్రత్యర్థులకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పనులు వెళ్లడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, అదే విషయాన్ని తాను ప్రస్తావించానన్నారు. గన్నవరంలో అక్రమ మట్టి వ్యాపారాలకు తాను ఎప్పుడూ వ్యతిరేకినేనని, ఇళ్ల స్థలాలకు అవసరమైన మట్టిని ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
విజయ డెయిరీలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై రైతులు, కార్యకర్తల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని యార్లగడ్డ తెలిపారు. డెయిరీ నిధుల వినియోగం, ప్రకటనల ఖర్చులు, పాలకవర్గం వ్యవహారశైలిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని, ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో రోడ్లపైకి వచ్చి పోరాడిన కార్యకర్తలే ఇప్పుడు తమ బాధను వ్యక్తం చేస్తున్నారని యార్లగడ్డ అన్నారు. లోకేష్ పాదయాత్ర సమయంలో కనిపించని వారు ఇప్పుడు పార్టీలో కీలక స్థానాల్లో ఉండటంపై కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల మేరకే ముందుకు వెళ్తామని తెలిపారు.రాష్ట్రంలో సాంకేతిక రంగంలో యువతకు అవకాశాలు కల్పించేందుకు హెచ్‌సీఎల్ ఫౌండేషన్ సహకారంతో పీ-4 కార్యక్రమం కింద ఈ నెల 17న ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు యార్లగడ్డ వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *