-20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ
-27న జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతిపత్రం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్త్రీశక్తి పథకం అమలుతో రోజుకు సుమారు 15 లక్షల మంది అదనపు ప్రయాణికులు పెరిగిన నేపథ్యంలో, వారి అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రజా రవాణా సేవలను విస్తరించాలని కోరుతూ ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన రెండో దశ ఉద్యమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 27వ తేదీన నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి పంపించి, ఆర్టీసీ పరిరక్షణకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు వెల్లడించారు.
జేఏసీ ప్రధాన డిమాండ్లు
– విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా కాకుండా, ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలి.
-స్త్రీశక్తి పథకం అమలుతో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పెద్ద ఎత్తున కొత్త బస్సులను తక్షణమే ప్రవేశపెట్టాలి.
-ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్, సూపర్‌వైజరీ తదితర అన్ని విభాగాల్లో సిబ్బంది కొరతను నివారించాలి.
– ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్టీసీకి అవసరమైన నిధులు, వనరులు ప్రభుత్వం తక్షణమే సమకూర్చాలి.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణతో పాటు ఆర్టీసీని మరింత సమర్థవంతమైన, ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సంస్థగా తీర్చిదిద్దడమే జేఏసీ ఉద్యమ లక్ష్యమని కన్వీనర్లు స్పష్టం చేశారు.
అలాగే, మూడో దశ ఉద్యమ కార్యాచరణను ఈ నెల 30వ తేదీన విజయవాడలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములై, 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ కో-చైర్మన్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, సి.హెచ్. సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్.వి. శేషగిరిరావు, కె. సూర్యప్రకాశరావు, డి. మాల్యాద్రి పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News