-వారం రోజుల్లో యాక్షన్ ప్లాన్ నివేదిక అందజేయాలి
-ఏజెన్సీలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ అంధ్ర కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏఐఐఎల్ఎస్‌జీ, సాహస్, వాష్ ఏజన్సీలు నిర్వహించే సీబీ (కెపాసిటీ బిల్డింగ్), ఐఈసీ(ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్) కార్యక్రమాలకు చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్, రోటరీ . .. వంటి పెద్ద పెద్ద అసోసియేషన్స్ వారిని ఆహ్వానించి, వారు పాల్గొనేవిధంగా కార్యక్రమాలను చేపట్టాలని ఏజెన్సీల వారిని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. అమరావతిలోని కార్పోరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఐఈసీ, సీబీ ప్రాజెక్ట్ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, స్వచ్ఛత కార్యక్రమాలలో చాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్స్ అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థల వారు తప్పనిసరిగా పాల్గొనే విధంగా, వారితో మాట్లాడి కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. నివాస కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్ లవారు కూడా పాల్గొనేవిధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్స్ కి సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయి అసోసియేషన్లు ఉన్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు నిర్వహించే రెండు మూడు ఐఈసీ కార్యక్రమాలలో తాను కూడా పాల్గొంటానని చైర్మన్ చెప్పారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’పై ప్రజలలో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు అత్యధిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి అందరికీ శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇతర వివరాలను ఒక్క వారంలో తమకు సమర్పించాలని చైర్మన్ పట్టాభిరామ్ చెప్పారు.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన సీబీ, ఐఈసీ కార్యక్రమాల వివరాలను ఏఐఐఎల్ఎస్‌జీ, సాహస్, వాష్ సంస్థలకు చెందిన ప్రతినిధులు చైర్మన్ పట్టాభిరామ్ కు వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో విస్తృత ప్రజా అవగాహన, సామర్థ్యాభివృద్ధికి వాష్ ఇన్‌స్టిట్యూట్ కీలక భాగస్వామ్యం వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గత పది నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌కు స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్‌నర్ గా సేవలందిస్తున్న తాము రాష్ట్ర వ్యాప్తంగా సమాచార, విద్య, ప్రచార (ఐఈసీ) వ్యూహాల రూపకల్పన, ప్రవర్తనలో మార్పు వంటి కార్యక్రమాలు, కమ్యూనికేషన్ మెటీరియల్ తయారీ, డిజిటల్ ప్రచారం, క్షేత్రస్థాయిలో వ్యవస్థల మధ్య సమన్వయం విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని 53 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీలు) ఇప్పటి వరకు 923 ఐఈసీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. వాటి ద్వారా 3.38 లక్షలకుపైగా పౌరులకు స్వచ్ఛత, వ్యర్థాలు వేరుచేయడం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా, వాష్ ఇన్‌స్టిట్యూట్, సాహస్ సంస్థలు సంయుక్తంగా గత పది నెలల్లో పట్టణ స్థానిక సంస్థల్లో 432 సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, 29,339 మందికి పైగా భాగస్వాములకు శిక్షణ అందించినట్లు వివరించారు. ఈ శిక్షణల్లో ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో తమ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకున్నట్లు తెలిపారు.
20కి చేరిన ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ కార్యాలయాలు
తమ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ కార్యాలయాలు 20కి చేరినట్లు ఏఐఐఎల్ఎస్ జీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు. మార్కెట్, ఇతర వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లలో స్వచ్ఛ రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 70 యూఎల్బీలలో 28,229 మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఐఐఎల్ఎస్‌జీ, సాహస్, వాష్ సంస్థలకు చెందిన ప్రతినిధులు వి.చలపతిరాజ్, వి.హైమావతి, హేతల్ జలాద్, వి. శశాంక్, ఎం.అర్జున్ ప్రసాద్, శివ కురెళ్ల, కిషోర్, ప్రవీణ్, రాజేష్, ఏ.శివన్నారాయణ, ఎన్.సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News