గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కమర్షియల్ వ్యర్ధాలను సేకరించే ప్రైవేట్ ఏజెన్సీల అనుమతులను పూర్తిస్తాయిలో రద్దు చేశామని, సోమవారం నుండి పూర్తిస్తాయిలో అమలులోకి వస్తుందని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గతంలో గుంటూరు నగరంలో వాణిజ్య వ్యర్థాలను ప్రైవేట్ ఏజెన్సీలైన క్యూబ్ ఎనర్జీ మరియు రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల వారు సేకరించేవారని, వారు 14 వాహనాలు, 56 మంది కార్మికులతో వ్యర్ధాలను సేకరించడంతో పాటు వ్యాపారుల నుండి యూజర్ ఫీజు వసూలు చేసేవారన్నారు. ప్రస్తుతం వాణిజ్య వ్యర్థాల సేకరణను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నేరుగా నిర్వహిస్తోందని, ఇందుకు ఎలాంటి యూజర్ ఫీజు చెల్లించనవసరం లేదని తెలిపారు. నగర పాలక సంస్థ ఈ సేవల కోసం ప్రత్యేకంగా 10 ట్రాక్టర్లు, 12 కాంపాక్టర్లు, 100 మంది పారిశుద్ధ్య కార్మికులను కేటాయించిందన్నారు. అందువల్ల నగరంలోని వ్యాపారులు గతంలో వ్యర్థాలు సేకరించిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలు ఇవ్వవద్దని, అలాగే ఎవరికీ యూజర్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని, ఎవరైనా యూజర్ ఫీజు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా లేదా వసూలు చేయడానికి ప్రయత్నించినా వెంటనే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్‌లైన్ నంబర్: 0863-2345103 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అందువల్ల నగరంలోని అన్ని వ్యాపార సంస్థల యజమానులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను వేర్వేరుగా వర్గీకరించి కార్పొరేషన్ సిబ్బందికి అందజేసి నగర పరిశుభ్రతకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News