అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తొలుత విమానాశ్రయానికి చేరుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి తో కలసి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. విమానాశ్రయం పరిసరాలను, టెర్మినల్ భవనాన్ని చూపించి.. అందులోని విశేషాలను వివరించారు. అతిధుల ప్రసంగాల అనంతరం వేదిక పై నుండే భోగాపురంతో పాటు 18వేల కోట్ల నిధులతో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన లను చేశారు.
అనంతరం ప్రారంభోత్సవ వేదికపై అతిథులతో కలసి రామ్మోహన్ నాయుడు భాగస్వామ్యం అయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. ఏడాదికోమారు, పుష్కరానికి ఒకసారి జరిగే వేడుక కాదు ఇది అని.. యుగానికి ఒకసారి జరిగే పండగ అని రామ్మోహన్ నాయుడు అన్నారు. అవకాశాల నిధి.. భోగాపురం విమానాశ్రయం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా ఉందని అన్నారు. ఏవియేషన్ హబ్ గా ఉత్తరాంధ్ర మారిన నేపథ్యంలో మెంటినెన్స్ వ్యవస్థ తో సహా.. అన్ని ఇక్కడ అందుబాటులో ఉండటంతో ప్రపంచం నలుమూలల నుండి విమానాలు ఇక్కడకు వచ్చి చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే జోన్, విమానాశ్రయం, స్టీల్ ప్లాంట్ లను అభివృద్ధి చేసిన ఘనత ఎన్డీయే సర్కారుకు దక్కుతుందని స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రి గా బాధ్యత తీసుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో 16కి పైగా విమానాశ్రయాలను ప్రారంభోత్సవం చేసుకున్నామని.. వాటికన్నా ఎక్కువ తృప్తి భోగాపురం విమానాశ్రయం ఇచ్చిందని, 2 లక్షలకు పైగా స్థానిక ప్రజానీకంతో ఘనంగా ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని అన్నారు. తన ప్రసంగం అనంతరం ప్రధాని ప్రసంగానికి సైతం తెలుగు అనువాదాన్ని రామ్మోహన్ నాయుడు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట మంత్రులు, జిఎంఆర్ ప్రతినిధులు, అధికారులు, విశేషంగా ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News