Breaking News

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం

-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీ ప్రోత్సాహం
-భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌.
-కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ

విజయనగరం(భోగాపురం), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు పర్యటించడం నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

భోగాపురంలో నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారనుందని శ్రీనివాస వర్మ అన్నారు.సుమారు రూ.5,000 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ విమానాశ్రయం రాబోయే రోజుల్లో లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందించనుందని తెలిపారు.

విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అన్నారు.

ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వ్యవసాయ, ఆక్వా, వాణిజ్య ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు వేగంగా తరలించేందుకు విమానాశ్రయం కీలకమైన రవాణా కేంద్రంగా మారుతుందని తెలిపారు.

ఏటా సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించే సామర్థ్యంతో ఈ ప్రాంతంలోని ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునే అవకాశం మరింత పెరుగుతుందని చెప్పారు.
దేశంలో మౌలిక వసతులకు పెద్దపీట

2014 లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశారని శ్రీనివాస వర్మ అన్నారు. రహదారులు, రైల్వేలు, జలమార్గాలు, విమాన మార్గాల ద్వారా దేశవ్యాప్తంగా కనెక్టివిటీని బలోపేతం చేస్తున్నారని తెలిపారు.

దేశ ఆర్థికాభివృద్ధికి మెరుగైన కనెక్టివిటీ అత్యంత కీలకమని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దేశ అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయని పేర్కొన్నారు.

ఉడాన్‌తో సామాన్యుడికి విమాన ప్రయాణం
విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉడాన్ (UDAN) పథకం నాంది పలికిందని భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఉడాన్ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

“హవాయి చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించాలి” అన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందన్నారు.

2014 కు ముందు దేశంలో ఉన్న విమానాశ్రయాల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోందని చెప్పారు. దీంతో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి మరింత ఊతం లభిస్తోందన్నారు.

భోగాపురం విమానాశ్రయం కొత్త అభివృద్ధి అధ్యాయానికి నాంది
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక కీలక ఘట్టమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందడంతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకం, లాజిస్టిక్స్, హోటల్ రంగం, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అభివృద్ధికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దవచ్చని శ్రీనివాస్ వర్మ అన్నారు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు గగనద్వారంగా నిలుస్తుందని, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *