– ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
– సర్పంచ్ లతో టెలీ కాన్ఫరెన్స్ లో డిప్యూటి సీఎం కృష్ణదాస్
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా పొందిన గృహ లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వరం లాంటిదని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పథకంలో ప్రయోజనాలపై జిల్లా కలెక్టర్ శ్రికేష్ లాటకర్ ఆధ్వర్యంలో వేయి మందికి పైగా సర్పంచ్ లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పేద ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలోనూ అడ్డుతగులుతున్న ప్రతిపక్షం ఈ పథకానికి కూడా దుష్ప్రచారానికి దిగడం శోచనీయమన్నారు. జిల్లాలో టిడిపి నేతలైన కళా వెంకట్రావు అచ్చంనాయుడు లాంటి వారు పేదలను డబ్బు కట్టవద్దని గ్రామాల్లో ప్రచారం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని వారి సొంత ఆస్తిగా మార్చి, రుణం నుంచి విముక్తుల్ని చేసి, సంపూర్ణ గృహ హక్కు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసే బృహత్తర లక్ష్యాన్ని పూర్తిచేయాలని సర్పంచులను కోరారు. పేదల సంక్షేమం కోసం జగనన్న సంపూర్ణ గహ హక్కు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు పథకానికి, వన్ టైం సెటిల్ మెంట్ పథకానికి ఏమాత్రం సంబంధం లేదని ఆయా లబ్ధిదారులకు విడమరచి చెప్పాలని సూచించారు. ఇంటి యజమానికి స్థిరాస్తి కింద శాశ్వత హక్కు కల్పించాలన్న ప్రధాన ధ్యేయంతో రాష్ట్రంలోని అన్ని సచివాలయాలలో కార్యదర్శులు సబ్ రిజిస్టార్ లుగా పనిచేసి అప్పటికప్పుడు సంపూర్ణ హక్కు పత్రాలను అందజేస్తారని స్పష్టం చేశారు.