Breaking News

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుతో గోదావరి తీరానికి పర్యాటక వైభవం:మంత్రి కందుల దుర్గేష్

-శెట్టిపేటలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్..డిసెంబర్ నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడి
-పుష్కరాలకు పర్యాటక కాంతులతో ముస్తాబవుతున్న గోదావరి పరివాహకం..భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలు..పర్యాటకులను కనువిందు చేయనున్న పుష్కర తీరాలు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక శోభ పరిమళించాలనే సంకల్పంతో చేపట్టిన అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు’ పనులను మంత్రి కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు మండలం శెట్టిపేటలో స్వయంగా పరిశీలించారు. పర్యటనలో భాగంగా అధికారులతో కలిసి పనుల నాణ్యతను, డిజైన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం పనులు జరుగుతున్న తీరును మంత్రి దుర్గేష్ పర్యవేక్షించి, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జ్ అభివృద్ధి, పుష్కర్ ఘాట్ పునర్నిర్మాణం, కడియం నర్సరీల వద్ద ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు చేస్తున్నామని అదే విధంగా గోదావరికి ఇటుగా ఉన్న నిడదవోలు నియోజకవర్గంలోని శెట్టిపేట గోదావరి కెనాల్ తీరంలో పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేలా బోటింగ్ పాయింట్, వే-సైడ్ రెస్టారెంట్, చిన్నారుల కోసం అధునాతన ‘ప్లే జోన్’, చినకాశీరేవు ఘాట్ అభివృద్ధి, తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ ఆలయంలో భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. “ఇప్పటికే శెట్టిపేట పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. 2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరంతో పాటు నిడదవోలు, కొవ్వూరు తదితర ప్రాంతాలలోని ఘాట్లలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.” అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకరంగ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి, అలాగే ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *