Breaking News

కృష్ణా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం

-ఎంఎస్ఎంఈ లకు సమగ్ర సహకారం.. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు
-జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్ తో కలిసి జిల్లాలో పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతి, సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు, పెండింగ్ దరఖాస్తులు, పెట్టుబడుల గ్రౌండింగ్, ఎంఎస్ఎంఈ లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

ఆగస్టు 3 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 107 దరఖాస్తులు అందగా, వాటిలో 79 దరఖాస్తులు ఎస్ఎల్ఎ గడువులోపు ఆమోదం పొందినట్లు అధికారులు తెలిపారు. మరో 28 దరఖాస్తులు ప్రస్తుతం ఎస్ఎల్ఏ వ్యవధిలో పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఏపీఐఐసీ, భూగర్భ జలాలు, ఫ్యాక్టరీస్ తదితర శాఖలు తమ పరిధిలోని దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశ్రామిక అనుమతుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పార్టనర్‌షిప్ సమ్మిట్–2025 సందర్భంగా కుదిరిన అవగాహనా ఒప్పందాల పురోగతిని కూడా సమావేశంలో సమీక్షించారు. భూ కేటాయింపు, మౌలిక వసతులు తదితర అంశాల్లో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, సంబంధిత లైన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు వివిధ పెట్టుబడి, వడ్డీ రాయితీ క్లెయిమ్‌ల కింద 5 పరిశ్రమలకు మొత్తం రూ.1,36,53,854 ప్రోత్సాహకాలను మంజూరు చేసి ఆమోదించారు.

సుస్థిర రవాణాను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ (ఎస్ఎంఈపి) 4.0 కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ప్రోత్సాహక క్లెయిమ్‌లకు రూ.64,166 మంజూరు చేశారు. ఎస్ఎంఈపి 4.0 నిబంధనల ప్రకారం, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ లేకుండా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసిన వారికి ఎక్స్‌షోరూమ్ ధరపై 5 శాతం, నమోదిత వాహన స్క్రాపింగ్ కేంద్రం నుంచి సర్టిఫికెట్ సమర్పించిన వారికి 10 శాతం వరకు కొనుగోలు ప్రోత్సాహకం, నిర్దేశిత పరిమితులకు లోబడి అందుతుందని అధికారులు తెలిపారు. దీనితో పాటు 100 శాతం రోడ్డు పన్ను మినహాయింపు కూడా అమల్లో ఉందని పేర్కొన్నారు.

సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, ఎల్డిఎం సి రవీంద్రారెడ్డి, డిఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, డిపిఓ ఎం ధనలక్ష్మి, ఉద్యాన మత్స్యశాఖ అధికారులు జే జ్యోతి, అయ్యా నాగరాజా, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, అగ్నిమాపక శాఖ అధికారి ఏసురత్నం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *