-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ శాఖాధిపతులతో రానున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అదనపు కమిషనర్ జనరల్‌ను నోడల్ అధికారిగా నియమించగా, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాలను పరిశీలించి, అవసరమైన మేరకు ఈ ఎన్నికల్లో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. CDMA వారు కోర్టు ప్రొసీడింగ్స్ అమలు చేయాలని ఆదేశించగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ఆదేశాలకు అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేసి, తదనంతర చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం ప్రతి వార్డులో ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ర్యాంపులు తదితర సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల సంఖ్య, ఇతర అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నగరపాలక సంస్థకు చెందిన ప్రతి శాఖకు బాధ్యత ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తూ, పరస్పర సమన్వయంతో పనిచేసి మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News