-కూటమి ప్రభుత్వంలో ప్రజా నాయకుడి విగ్రహాలకు రక్షణ కరువైంది
-ఉండ్రాజవరంలో వంగవీటి రంగా విగ్రహం, దిమ్మె తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
-బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండల కేంద్రంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా విగ్రహంతో పాటు ఆయన దిమ్మెను తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. శనివారం సెంట్రల్ నియోజకవర్గం జనహిత సదనం కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఇటువంటి తుచ్ఛమైన చర్యలకు పాల్పడటం సరికాదని, రంగా విగ్రహాలను బలవంతంగా తొలగించేందుకు ప్రయత్నించడం ఇది మొట్టమొదటిసారి కాదని ఆయన మండిపడ్డారు. ఉండ్రాజవరంతో పాటు గతంలో ఏలూరు జిల్లా కాళిదిండి, రుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలను పేడ పూసి అపవిత్రం చేసి ధ్వంసానికి పాల్పడ్డారని, విజయవాడ సింగ్ నగర్, మచిలీపట్నం రేడియో సెంటర్ ప్రాంతాల్లోనూ విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. పేదవాడి హక్కుల కోసం, సంక్షేమం కోసం నిత్యం పోరాటాలు చేసిన మహానాయకుడు రంగా అని గుర్తుచేశారు. ప్రజలు ఎంతో అభిమానంతో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారని, భౌతికంగా విగ్రహాలు తొలగించినంత మాత్రాన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రంగా జ్ఞాపకాలను ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరుతో ఓపిక నశించి అభిమానులు స్వయంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే, దాన్ని కూడా బలవంతంగా తొలగించడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగా గారిని ఏ విధంగా గౌరవించిందో, ఇప్పుడు కూడా ఇటువంటి చర్యలను సహించేది లేదన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రంగా అభిమానులు, వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News