-అధికారులకు ఆర్డీఓ కె రాజ్యలక్ష్మి ఆదేశం
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరికమే ప్రాతిపదికగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు తన దరఖాస్తులో తాను సామాజిక పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, రాజకీయ కారణాలతో తనకు పెన్షన్ మంజూరు కాకుండా గ్రామ వాలంటీర్ అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా,వెంటనే అగిరిపల్లి ఎంపిడిఓ కి ఫోన్ చేసి సదరు విషయంపై వెంటనే విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ కుల మత రాజకీయాలకు అతీతంగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ విషయంలో సిబ్బందిపై ఆరోపణలు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విసన్నపేట వాస్తవ్యులు నెక్కలపు మనోజ్ కుమార్ తన దరఖాస్తులో తనకు రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ లో కొంత భూమి ఉందని తన పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉందని కానీ ప్రభుత్వ ఆన్లైన్ లో తన పేరు కనిపించుటలేదు కావున లో ఆన్లైన్ లో భూమి వివరాలు తన పేరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరగా, ఈ విషయంపై తగు తీసుకోవలసిందిగా రెడ్డిగూడెం తహసిల్దార్ ను ఆర్డీఓ ఆదేశించారు. గన్నవరం మండలం వెదురుపావులూరు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు గన్నవరం లో కొత్తగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ నిమిత్తం కొంత భూసేకరణ చేశారని, పాత రైల్వే లైన్ కి, కొత్తగా ప్రతిపాదిత రైల్వే లైన్ కి మధ్యలో తమ భూములు ఉన్నాయని దీని కారణంగా తమ భూములు వ్యవసాయానికి పనికి రావడం లేదని కావున సదరు భూములను కూడా భూసేకరణ చేసి నష్ట పరిహారం అందించాలని కోరారు. నూజివీడు మండలం వెంకటాయపాలెం లో కొత్తగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాన్ని ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించాలని ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు దరకాస్తులో కోరగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖాధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఆగిరిపల్లి మండలం కనసానిపల్లి గ్రామస్తులు తమ దరఖాస్తులో 2016లో ఎన్. డి.ఆర్.ఎఫ్. నిమిత్తం తమ భూములను భూసేకరణ ద్వారా తీసుకుని నష్ట పరిహారం చెల్లించారని, కానీ ఆ భూములలో ఫలసాయం అందించే చెట్లకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని కోరగా, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశించారు. స్పందన కార్యక్రమం లో డివిజనల్ సహకార అధికారి భాస్కరరావు, వ్యవసాయ శాఖ అధికారి, అనురాధ , సి డి పి ఓ వెంకటలక్ష్మి, ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అనూష సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి ఎం హరినాథ్ ప్రభృతులు పాల్గొన్నారు.