-“భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని నిషేధించాలని సీఎంకు వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బట్రాజు కుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. విజయవాడ గొల్లపూడి లోని రాష్ట్ర బీసీ సంక్షేమ భవన్ లో ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో “భట్రాజుల ఆత్మగౌరవ ప్రతీక” అని రాష్ట్ర భట్రాజు కుల సభ్యులు ప్రేమగా పిలుచుకునే అన్నమయ్య జిల్లాకు చెందిన “పాలగిరి. చంద్రకళ” ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు కుల సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని భట్రాజ కుల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ,రాజకీయంగా చైతన్య పరచడమే తన లక్ష్యమని, రాష్ట్రంలోని ప్రతి భట్రాజ కుల మహిళకు సహాయ, సహకారాలు అందించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. విద్యాబోధన కులవృత్తిగా చేసుకొని పండితా రాజులై “విద్వత్ కులం”గా ఉన్నటువంటి బట్రాజ కులాన్ని సమాజంలో తమ ఉపమాన ,ఉపమేయాలకు” భట్రాజుల పొగడ్తలు” అంటూ ప్రస్తావించకూడదని ఆ విధంగా ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళలకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని నిషేధించి భట్రాజ కుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫకీర్ రాజు, ప్రధాన కార్యదర్శి లేపాక్షి ఈశ్వర రాజు ఇతర కార్యవర్గ సభ్యులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భట్ రాజ కుల సభ్యులు పాల్గొన్నారు.