-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయ సిబ్బందికి ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే వాటికి సరైన పరిష్కారం చూపగలుగుతారని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. జి. కొండూరు మండలం వెల్లటూరు గ్రామ సచివాలయాన్ని, జగనన్న లేఅవుట్లలో గృహా నిర్మాణాల ప్రగతిని, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి వుండాలన్నారు. జాప్యం లేకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు పారదర్శకతను పాటించాలన్నారు. స్పందనకు సంబంధించిన ఆర్జీలను ఆయా అధికారులు వెంటనే అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేయడంలో జాప్యం జరుగుతుందని, గ్రామానికి చెందిన 40 ఎకరాల పడమట చెరువు చౌడుభూమిగా మారి నిరుపయోగంగా ఉందని ఆ భూమిని రొయ్యల చెరువులుగా మార్చుకోనేందుకు పేదలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక కెడిసిసి బ్యాంకు డైరెక్టర్ జి. రవీంద్రరాణా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రాధమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కుంటముక్కల గ్రామం నందు గతంలో రావి చెరువుకు సంబంధించిన భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందని వీరిలో కొంతమందికి పాస్ పుస్తకాలు ఇచ్చారని మిగిలిన వారికి కూడా పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కుంటముక్కల గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్థుల సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఆయా అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
వెల్లటూరు జగనన్న కాలనీని పరిశీలించిన కలెక్టర్
వెల్లటూరు జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను కలెక్టర్ డిల్లీరావు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమ్మెంట్, ఐరన్ వంటి మౌలిక వసతులను అందుబాటులో ఉంచి పనులను మరింత వేగవంతం చేసి లబ్దిదారుల సొంత ఇంటి కలను నేరవేర్చాలన్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కేంద్రాన్ని పరిశీలించి ప్రాసెస్ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పొడి తడి చెత్తను సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించాలన్నారు. చెత్తనుండి సంపద తయారు చేసేవిధంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఉండాలని ఆ కేంద్రాలలో కంపోస్ట్ ఎరువు తయారు చేసి ఆ ఎరువును రైతులు పంట భూములకు వినియోగించుకునే విధంగా నిర్వహణ కేంద్రం వుండాలని కలెక్టర్ అన్నారు.
వెల్లటూరు గ్రామ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహాశీల్థార్ యండి ఇంతియాజ్ పాషా, యంపిడివో అనురాధ, యంపిపి వి. లక్ష్మితిరుపతమ్మ, జడ్పిటిసి మంగా జగ్రధరరావు, హౌసింగ్ డిఇ నాగమల్లేశ్వరరావు, ఏఇ శ్రీనివాస్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ నవీన్‌కుమార్, పంచాయతీరాజ్ ఎఇ దాసు తదితరులు ఉన్నారు.